కొత్త పార్టీతో జాతీయ రాజకీయాలలోకి కేసీఆర్‌?

September 07, 2020


img

ఇవాళ్ళ రెండు, మూడు ప్రధాన తెలుగు న్యూస్ ఛానల్స్‌లో ఓ ఆసక్తికరమైన వార్త ప్రసారమైంది. సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించేందుకు ‘నయా భారత్‌’ అనే ఓ జాతీయ రాజకీయపార్టీని స్థాపించడానికి సన్నాహాలు చేస్తున్నారని దాని సారాంశం. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళు సమయం ఉండగా ఇప్పుడు కేసీఆర్‌ జాతీయ పార్టీ ఎందుకు పెట్టాలనుకొంటున్నారు? అనే ప్రశ్నకు కూడా ఆ న్యూస్ ఛానల్సే సమాధానం చెప్పాయి. 

ప్రధాని నరేంద్రమోడీ దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకొంటున్నారని దాని సాధ్యాసాధ్యాలు, విధివిధానాల గురించి అధ్యయనం చేసేందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపాని నేతృత్వంలో ఓ అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారని సదరు న్యూస్ ఛానల్స్ పేర్కొన్నాయి. 2022-23లో లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలని బిజెపి అనుకొంటోందని, వాటిలో బిజెపి మళ్ళీ లోక్‌సభలో మెజార్టీ స్థానాలు గెలుచుకొన్నాక దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ రాజ్యాంగసవరణ చేయాలని భావిస్తోందని  అవి పేర్కొన్నాయి. 

అదే కనుక జరిగితే కేవలం జాతీయ పార్టీలు మాత్రమే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయగలవు. ప్రాంతీయ పార్టీలు శాసనసభ ఎన్నికలకు మాత్రమే పరిమితం కావలసి ఉంటుంది. ఇది ముందే పసిగట్టిన సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీ ప్రయత్నాలను అడ్డుకొనేందుకే ‘నయా భారత్‌’ అనే జాతీయపార్టీని స్థాపించడానికి చురుకుగా సన్నాహాలు చేస్తున్నారని సదరు న్యూస్ ఛానల్స్ పేర్కొన్నాయి. 

సిఎం కేసీఆర్‌ 2019 లోక్‌సభ ఎన్నికలలోనే ఫెడరల్ ఫ్రంట్‌ ద్వారా జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించడానికి సిద్దం అయినప్పటికీ, ఆయన అంచనాలకు భిన్నంగా బిజెపి భారీ మెజార్టీతో మళ్ళీ అధికారం దక్కించుకోవడంతో వెనక్కు తగ్గవలసి వచ్చింది. కానీ ఒకవేళ దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి ప్రయత్నిస్తే, అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు తీవ్రంగా నష్టపోతాయి కనుక అవన్నీ తమ మనుగడ కోసం, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కలిసి పనిచేయడానికి తప్పకుండా ముందుకు వస్తాయని, వాటన్నిటినీ నయా భారత్‌ పార్టీ గొడుగు కిందకు తీసుకువచ్చి దానికి తాను సారధ్యం వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారని ఆ న్యూస్ ఛానల్స్ వార్తల సారాంశం. 

అయితే కేసీఆర్‌ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవచ్చునని, ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో వెళితేనే ఇతర రాష్ట్రాలలో పార్టీలు వాటి ప్రభుత్వాల నుంచి ఆయన మాటకు విలువ, గౌరవం లభిస్తాయని ఆ న్యూస్ ఛానల్స్ పేర్కొన్నాయి. ఇప్పటికే పలుశాఖలను సమర్ధంగా నిర్వహిస్తున్న కేటీఆర్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయవచ్చునని, తాను జాతీయ రాజకీయాలలో కుదురుకొన్నాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ కుర్చీలో కేటీఆర్‌ను కూర్చోబెట్టాలని సిఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని సదరు న్యూస్ ఛానల్స్ పేర్కొన్నాయి. 

ఈ వార్తలు నిజమో కాదో త్వరలోనే తేలిపోతుంది. అయితే నిప్పు లేనిదే పొగరాదు కనుక ఈ వార్తలలో ఎంతో కొంత నిజముండే ఉంటుందని భావించవచ్చు.


Related Post