కేటీఆర్‌ ముఖ్యమంత్రి ఎప్పుడవుతారంటే... రేవంత్‌ రెడ్డి జోస్యం

September 05, 2020


img

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఇటీవల ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో “మీ అంచనాల ప్రకారం కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారు?” అనే ప్రశ్నకు రేవంత్‌ రెడ్డి చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. 

“సాధారణంగా రాజకీయనేతలు 70-80 ఏళ్ళ వరకు రాజకీయాలలో లేదా తమ పదవులను అంటిపెట్టుకొని ఉండేందుకే మొగ్గుచూపుతారు. కనుక కేసీఆర్‌ కూడా అంతవరకు ఏదో ఓ పదవిలో కొనసాగాలనుకోవడం సహజం. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నారు కనుక ఆ పదవి ఆశిస్తున్న కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత, సంతోష్ మద్య మ్యూజికల్ చైర్ గేమ్ నడుస్తోంది. కానీ ఏదో ఓ రోజున ఆ కుర్చీలో తన కొడుకును కూర్చోబెట్టాలని కేసీఆర్‌ కోరుకోవడం సహజం కనుక మిగిలినవారికి నిరాశ తప్పదు. 

అయితే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలంటే కేసీఆర్‌కు ఇంకా పెద్ద పదవి ఏదైనా ఉండాలి. రాష్ట్రస్థాయిలో ఇంతకంటే పెద్ద పదవి లేదు కనుక జాతీయరాజకీయాలలోకి వెళ్లాలనుకొంటున్నారు. అయితే కేసీఆర్‌ ఢిల్లీకి మకాం మార్చుతారా లేదా ఎప్పుడు మార్చుతారు? అంటే రాబోయే ఆరేడు నెలల్లో జరుగబోయే వివిద రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 

ఒకవేళ ఆ ఎన్నికలలో బిజెపి కూటములే గెలిస్తే సిఎం కేసీఆర్‌ కేసీఆర్‌ ఎన్డీయేలో చేరిపోయి కేంద్రమంత్రి పదవి తీసుకొని ఇక్కడ ముఖ్యమంత్రి కుర్చీలో కేటీఆర్‌ను కూర్చోబెట్టేస్తారు. ఒకవేళ ఆ ఎన్నికలలో బిజెపి కూటములు ఓడిపోయి ప్రతిపక్ష పార్టీలు గెలిచినట్లయితే, కేసీఆర్‌ మళ్ళీ తన ఫెడరల్ ఫ్రంట్‌ ప్రతిపాదనను అటకపై నుంచి కిందకు దించి, ప్రతిపక్షాలను కూడగట్టి “మోడీ లేడు... గీడీ లేడు...అందరం కలిసి దించేద్దాం…” అంటూ హడావుడి మొదలుపెడతారు. ఆవిధంగా జాతీయ రాజకీయాలలోకి కేసీఆర్‌ షిఫ్ట్ అయిపోయినా కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చు. 

ఇదంతా రాబోయే 12 నెలల్లో జరిగే అవకాశం ఉంది కనుకనే ఆలోగా కొత్త సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని సిఎం కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారు. కొడుకును కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లో కూర్చోబెట్టి ఆయన  ఢిల్లీకి మకాం మార్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయం కేటీఆర్‌ కూడా గ్రహించినట్లే ఉన్నారు అందుకే అప్పుడే ఉన్నతాధికారులను మెల్లగా తన గ్రిప్‌లోకి తెచ్చుకొంటున్నారు,” అని రేవంత్‌ రెడ్డి చెప్పారు.


Related Post