పట్టువీడని భారత్‌-వెనక్కు తగ్గని చైనా

September 05, 2020


img

మాస్కోలో భారత్‌, చైనా రక్షణమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెయ్ ఫేంఝేల మద్య ఇవాళ్ళ సుమారు రెండు గంటలకు పైగా సమావేశం జరిగింది. ఇరుదేశాల సైన్యాలు సరిహద్దుల వద్ద ఎదురెదురుగా మోహరించి ఉన్నప్పుడు రక్షణమంత్రుల స్థాయిలో జరిగిన ఈ అత్యున్నత సమావేశం చాలా ప్రాధాన్యమైనదని వేరే చెప్పక్కరలేదు. చైనా అభ్యర్ధన మేరకు భారత్‌ రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 

చైనా ఖచ్చితంగా దురాక్రమణకు పాల్పడిందని ఈ సమావేశంలో పాల్గొన్న చైనా రక్షణమంత్రి మొహం మీదనే రాజ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కనుక తక్షణమే చైనా సేనలను అక్కడి నుంచి ఉపసంహరించాలని స్పష్టం చేశారు. 

అయితే ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే చైనా కూడా ఓ అధికారిక ప్రకటన చేసింది. సరిహద్దు ఘర్షణలకు భారత్‌ దుందుడుకుతనమే కారణమని, చైనా తన భూభాగంలో అంగుళం కూడా వదులుకోబోదని ప్రకటించింది. శాంతియుత చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నామని కానీ తన భూభాగం కాపాడుకోవడం కోసం దేనికైనా సిద్దమేనని చైనా ప్రకటించింది. చైనా ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే భారత్‌ కూడా ఇంచుమించు ఆవిధంగానే ప్రకటించింది. 

ఈ సమస్య చివరికి ఎటువంటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందో తెలియదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వైఖరిని గట్టిగా ఖండించడమే కాక అవసరమైతే  భారత్‌కు అండగా నిలబడతానని చెప్పారు. కానీ సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, భారత్‌, చైనాలు అంగీకరిస్తే ఇరుదేశాల మద్య మధ్యవర్తిత్వం చేసి ఈ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని ప్రకటించారు.  

ప్రస్తుతం ఇరుదేశాల మద్య ప్రతిష్టంభన ఏర్పడినందున ఇక ఈ సమస్య చర్చల ద్వారా పరిష్కారం అవుతుందనే నమ్మకాలు తగ్గిపోతున్నాయి. సరిహద్దుల వద్ద ఒక్క తూటా పేలినప్పటికీ అది భారత్‌ చైనాల మద్య ప్రత్యక్షయుద్ధానికి దారి తీస్తుంది. కనుక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని భావించవచ్చు. 


Related Post