దయనీయ జీవితాలు గడుపుతున్న ఉపాధ్యాయులు

September 05, 2020


img

నేడు జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. భారతీయ సంస్కృతిలో తల్లితండ్రులు తరువాత గురువుకే ప్రాధాన్యం. అందుకే మాతృదేవో భవ...పితృదేవో భవ...ఆచార్య దేవోభవ...అని అంటారు. అలాగే గురువు త్రిమూర్తులతో సమానమని సూచిస్తూ గురుర్ బ్రహ్మ... గురుర్ విష్ణు... గురుర్ దేవో మహేశ్వరః... అంటూ గురువుకు దేవుడితో సమానంగా పూజ్య స్థానం కల్పించారు. గురువుకు ఇంత గౌరవం...పూజ్యస్థానం ఎందుకంటే గురువే పిల్లలకు ప్రపంచాన్ని పరిచయం చేసి ఏవిధంగా జీవించాలో మార్గదర్శనం చేస్తారు. గురువే పిల్లలకు విద్యతో పాటు వివేకం, విచక్షణ, సంస్కారం, లోకజ్ఞానం వంటివన్నీ నేర్పిస్తారు. గురుశిక్షణలో రాటుదేలిన ఆ పిల్లలే సమాజంలో భాగమవుతారు. అంటే ఓ చక్కటి సమాజాన్ని రూపొందించేవాడే గురువు అని అర్ధమవుతోంది. అందుకే మన భారతీయ సంస్కృతిలో గురువుకు అంత సమున్నత గౌరవం ఉంది. 

కానీ నేటి మన సమాజంలో గురువుకు నిజంగా అంతా గౌరవం లభిస్తోందా?అంటే లేదనే చెప్పాలి. సమాజాన్ని తయారుచేసే గురువులు ఆ సమాజం చేతిలోనే నలిగిపోతున్నారిప్పుడు. కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రభుత్వం ఉపాధ్యాయులకు జీతాలలో కోతలు భరిస్తే సరిపోతోంది కానీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉపాద్యాయులు, లెక్చరర్‌లు, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలలో పనిచేసేవారు గత ఆరు నెలలుగా ఉద్యోగాలు కోల్పోవడంతో తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం పొలాలలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. రోడ్లపై కూరలుగాయాలు అమ్ముకొంటున్నారు. కొందరు ఆటోరిక్షా డ్రైవర్లుగా మారారు.

 

సమాజంలో గురువులు కూడా ఓ భాగమే కనుక వారు కూడా ఈ కష్టకాలంలో ఏదో ఓ పనిచేసుకొంటూ కుటుంబ పోషణ చేసుకోవడం అభినందనీయమే కానీ ఓ రంగానికి చెందిన (విద్యాబోధన) వారు వేరే రంగంలో ఏవిధంగా మనుగడ సాగించగలరు?ఎంతకాలం సాగించగలరు? అని ప్రభుత్వాలు ఆలోచించి ఉంటే వారికీ ఓ దారి చూపగలిగి ఉండేవి. 


ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ ఉపాద్యాయుల దయనీయ జీవితాల గురించి రోజూ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వారిని పట్టించుకొనే నాధుడే లేడు. వారి దయనీయ పరిస్థితిని చూస్తున్నప్పుడు పైన మనం చెప్పుకొన్న గొప్ప సంస్కృతి ఏమైపోయిందనిపించక మానదు. 


ఇప్పుడప్పుడే పాఠశాలలు, కాలేజీలు తెరుచుకొనే అవకాశాలు లేవు. ఆ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్దులు విద్యకు దూరమవుతున్నారు. కనుక ఉద్యోగాలు కోల్పోయి దయనీయ జీవితాలు గడుపుతున్న ఉపాధ్యాయుల సేవలు ప్రభుత్వం ఉపయోగించుకొంటే అటు వారికీ, ఇటు విద్యార్దులకు కూడా ఎంతో మేలు కలుగుతుంది.


Related Post