జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం పార్టీల హడావుడి షురూ

September 05, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరిలో జరుగవలసి ఉంది. అంటే ఎన్నికలు దగ్గరకు వచ్చేసినట్లే. అందుకే అధికార టిఆర్ఎస్‌, ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, బిజెపిల హడావుడి మొదలైంది. 

ఈ ఏడాది డిసెంబర్‌లోగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాలో 80,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రకటన ఎన్నికలకు ముందు ఇచ్చే వరం వంటిదేనని భావించవచ్చు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నందున జీహెచ్‌ఎంసీ ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ రోడ్లు నిర్మిస్తోంది. హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్న దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ త్వరలోనే ప్రారంభోత్సవం చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీ నగరం నలుమూల బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడేలోగా వాటి ప్రారంభోత్సవాలు జరుగుతాయి. 

ఎన్నికలున్నా లేకపోయినా ఇవన్నీ నిరంతరం జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలే అయినా, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు జరిగేవాటితో అధికార పార్టీ ఎంతో కొంత లబ్ది పొందాలని ఆశించడం సహజం. కనుక టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు నగరంలో జరుగుతున్న ఈ అభివృద్ధిపనుల గురించి మరికొంచెం గట్టిగా నొక్కి ప్రజలకు చెప్పడం మొదలుపెట్టారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో గత 5 ఏళ్లుగా జోరుగా అభివృద్ధిపనులు జరుగుతున్నందున, కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి మరోదారి వెతుకొంటుండగా వాటి చేతికి కరోనా అనే బ్రహ్మాస్త్రం లభిచింది. కరోనా పరీక్షలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం చూపడం, ఆ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం, కరోనాను కట్టడి చేయడంలో విఫలమైనందుకు ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు, కరోనా తప్పుడు లెక్కలు కరోనా మరణాలు వంటివి అస్త్రాలుగా చేసుకొని జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు సిద్దం అవుతున్నాయి. 

టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు గడిచిపోయినా ఇంతవరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ హామీని నిలబెట్టుకోకపోవడంతో టిఆర్ఎస్‌ను ప్రజల ముందు దోషిగా నిలిపేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. టిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఉన్న నిరుద్యోగయువతకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 శాసనసభ ఎన్నికలలో హామీ ఇచ్చింది. రెండుళ్ళు గడుస్తున్నా టిఆర్ఎస్‌ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. కనుక ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు నిరుద్యోగ భృతి గురించి టిఆర్ఎస్‌ను గట్టిగా నిలదీయవచ్చు.   

శిధిలావస్థకు చేరుకొన్న ఉస్మానియా ఆసుపత్రిని పట్టించుకోకుండా వందల కోట్లు విలువ చేసే సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో ఈ కరోనా కష్టకాలంలో 5-600 వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించడానికి పూనుకోవడం వంటివి ప్రతిపక్షాలకు ఆయుధాల వంటివేనని చెప్పవచ్చు. 

కనుక కరోనా కట్టడిలో...హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ పాలన సాగుతోందనే వాదనలతో కాంగ్రెస్‌, బిజెపిలు ఓటర్ల ముందుకు వెళ్లబోతున్నాయి. 

కానీ టిఆర్ఎస్‌ చేతికి జీహెచ్‌ఎంసీ వచ్చిన తరువాత నగరంలో కళ్ళకు కనబడే అంతగా జోరుగా అభివృద్ధిపనులు జరుగుతున్నందున, ప్రజలు వాటినే పరిగణనలోకి తీసుకొంటారు తప్ప ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకపోవచ్చు. అదీగాక రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుదు జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ లేదా బిజెపి చేతికి అప్పజెప్పితే రాష్ట్ర ప్రభుత్వం-జీహెచ్‌ఎంసీ మద్య సయోద్య కుదరక అభివృద్ధి కుంటుపడే ప్రమాదం కూడా ఉంటుందని ప్రజలు భావిస్తే మళ్ళీ గులాబీ జెండాయే జీహెచ్‌ఎంసీపై ఎగురుతుంది.


Related Post