సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

September 03, 2020


img

ఈ నెల 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు మొదలవనున్నాయి. కనుక సిఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ప్రభుత్వ విప్‌లతో సమావేశమయ్యి శాసనసభలో అనుసరించవలసిన వ్యూహం, సభలో చర్చించవలసిన అంశాల గురించి చర్చించారు. సమావేశాలు మొదలయ్యే రోజునే అంటే.. 7వ తేదీ ఉదయం టిఆర్ఎస్‌ ఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలలో జీఎస్టీ విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ప్రధానంగా చర్చించి శాసనసభ వేదికగా కేంద్రం వైఖరిని రాష్ట్ర ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించి రెవెన్యూ చట్టానికి ఈ సమావేశాలలో ఆమోదముద్ర వేయించుకోబోతోంది. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహరావుకు భారత రత్న అవార్డును ఇవ్వాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి ఆమోదించబోతోంది. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా సభలో చర్చించవలసిన అంశాల గురించి పూర్తిగా అవగాహన ఏర్పరచుకొని రావాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగేలా సిద్దం అయ్యి పూర్తి సమాచారంతో సమావేశాలకు రావాలని సిఎం కేసీఆర్‌టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రతిపక్షాలు కోరితే ఎన్ని రోజులైనా సమావేశాలు పొడిగించి వారు లేవనెత్తిన సమస్యలపై లోతుగా చర్చిద్దామని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post