పీవీపై టిఆర్ఎస్‌కు అంత ప్రేమ ఎందుకో?

September 03, 2020


img

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుపై హటాత్తుగా టిఆర్ఎస్‌కు ప్రేమ పుట్టుకురావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ తీసేందుకే స్వర్గీయ పీవీని టిఆర్ఎస్‌ భుజానికి ఎత్తుకొని ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. తెలంగాణకు చెందిన పీవీ అత్యున్నతమైన ప్రధాని పదవి చేపట్టి దేశాన్ని ఎంతో సమర్ధంగా నడిపించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆయనను పట్టించుకోకుండా సోనియా, రాహుల్ భజన చేస్తున్నారని టిఆర్ఎస్‌ ప్రజలకు చాటి చెప్పాలని యోచిస్తోందేమో? ‘సోనియా గాంధీ దయతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, కనుక అందుకు కృతజ్ఞతగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని’ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రతీ ఎన్నికలలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండటం అందరికీ తెలుసు. త్వరలో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌ నేతలు మళ్ళీ అదే పాట పాడటం ఖాయం. వారి పాటకు ఓట్లు రాలవని వారికీ తెలుసు. అది వేరే విషయం. 

తెలంగాణలో సోనియా, రాహుల్‌ గాంధీ ప్రభావం లేకుండా పూర్తిగా తుడిచేయాలంటే వారికి ధీటైన వ్యక్తిని ముందుకు తీసుకురావలసి ఉంటుంది. స్వర్గీయ పీవీపై టిఆర్ఎస్‌కు హటాత్తుగా ప్రేమ పుట్టుకురావడానికి ఇదీ ఒక కారణమయ్యి ఉండవచ్చు. ఇదిగాక ఇంకా బలమైన కారణం లేదా వ్యూహం ఏదో ఉండే ఉంటుంది. అదేమిటో ఎన్నికల సమయానికే అర్ధమవుతుంది. బహుశః అందుకే టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఏడాది పొడవునా స్వర్గీయ పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించి ఉండవచ్చు. 

పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పడం కూడా దీర్గకాలిక వ్యూహంలో భాగమేనని భావించవచ్చు. రాష్ట్రంలో ముస్లింలను ప్రసన్నం చేసుకొనేందుకు వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ టిఆర్ఎస్‌ ప్రభుత్వం, 2018 శాసనసభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగా  అంటే ఏప్రిల్ 16, 2017న శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ ఆ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించదనే సంగతి టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి ముందే తెలుసు. అయినా కూడా ముస్లింల సంక్షేమానికి మా పార్టీ కట్టుబడి ఉందని గట్టిగా ప్రచారంలో చేసుకొంది. దానిని రాష్ట్ర బిజెపి నేతలు బహిరంగానే వ్యతిరేకించారు. ఎన్నికలకు ముందు సుమారు ఏడాదిన్నరపాటు ఈ అంశంపై జరిగిన చర్చలు, వాదోపవాదాలు అన్నీ టిఆర్ఎస్‌కే అనుకూలంగా మారాయని అందరికీ తెలుసు. ముస్లింలకు  రిజర్వేషన్లు కల్పించడాన్ని రాష్ట్ర బిజెపి నేతలు గట్టిగా వ్యతిరేకించడంతో లబ్ది పొందినది టిఆర్ఎస్ మాత్రమే. అయితే నేటికీ ముస్లింలకు రిజర్వేషన్లు రాలేదు...కానీ టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు! కనుక ఇప్పుడు స్వర్గీయ పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ టిఆర్ఎస్‌ ప్రభుత్వం శాసనసభలో చేయబోయే తీర్మానం కూడా అటువంటి రాజకీయ ప్రయోజనమేదో ఆశించి చేస్తున్నదేనని భావించవచ్చు. 

ఒకవేళ స్వర్గీయ పీవీకి భారతరత్న అవార్డు ఇస్తే, ఆ క్రెడిట్ శాసనసభలో తీర్మానం చేసినందుకు టిఆర్ఎస్‌కే దక్కుతుంది తప్ప రాష్ట్ర బిజెపికి దక్కదని కేంద్రానికి కూడా తెలుసు. కనుక ఆ ప్రతిపాదనను కూడా కేంద్రం పక్కన పెట్టడం తధ్యం.  కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కన పెడుతుందని టిఆర్ఎస్‌కు కూడా బాగా తెలుసు. 

2018 శాసనసభ ఎన్నికలలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఏవిధంగా ప్రచారం చేసుకొని లబ్ది పొందిందో ఇప్పుడూ అదేవిధంగా చేసుకొని లబ్ది పొందాలని ప్రయత్నించవచ్చు. కనుక కేంద్రం స్వర్గీయ పీవీకి భారతరత్న ఇస్తుందా లేదా అనేది ముఖ్యం కాదు.. తీర్మానం చేసి పంపామా లేదా అనేదే ముఖ్యం. ఈ అభిప్రాయాలు సరైనవేనని ఇప్పుడే చెప్పలేము కానీ స్వర్గీయ పీవీని టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఊరికే భుజానికెత్తుకోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది నిజమో కాదో వచ్చే ఎన్నికలప్పుడే తెలుస్తుంది. 


Related Post