బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఫేస్‌బుక్‌ షాక్

September 03, 2020


img

తెలంగాణలో ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ప్రముఖ సామాజిక మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ పెద్ద షాక్ ఇచ్చింది. ఆయన ఫేస్‌బుక్‌, ఇంస్టాగ్రామ్ ఖాతాలని నిలిపివేసింది. ఆయన విద్వేషపూరితమైన, హింసను ప్రేరేపించేవిధంగా సందేశాలు పెడుతున్నారని అటువంటివాటికి ఫేస్‌బుక్‌ వేదికగా నిలవాలనుకోవడంలేదని తెలిపింది. అవి సంస్థ నిబందలకు విరుద్దం కనుక ఆయన ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. హింసను ప్రేరేపించే సందేశాలు ఫేస్‌బుక్‌కు ఎన్నడూ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది. ఇక ముందు కూడా ఫేస్‌బుక్‌ ఇదే వైఖరికి కట్టుబడి ఉంటుందని, నిబందనలను ఉల్లంఘించేవారి ఖాతాలను గుర్తించి ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉంటామని ఫేస్‌బుక్‌ సంస్థ ప్రతినిధి చెప్పారు. 

ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఫేస్‌బుక్‌ నిర్ణయాన్ని తప్పు పట్టారు. “నా పేరు మీద ఎవరో ఎక్కడో ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిస్తే దానికి నేను ఎలా బాధ్యుడిని అవుతున్నాను?నాపై బురద జల్లాలని ఎవరో నాపేరు మీద నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి ఉపయోగిస్తున్నారు. వాటన్నిటినీ రద్దు చేసి 2018లో నేను స్వయంగా ఓపెన్ చేసిన్ ఫేస్‌బుక్‌ ఖాతాను మాత్రమే పునరుద్దరించవలసిందిగా ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 


Related Post