చైనాకు భారత్‌ మరో షాక్

September 02, 2020


img

సరిహద్దులో దురాక్రమణకు పాల్పడుతూ మళ్ళీ భారత్‌పై బురద జల్లుతున్న చైనాకు కేంద్రప్రభుత్వం ఇవాళ్ళ మరో షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన పబ్జీతో సహా మొత్తం 118 మొబైల్ యాప్‌లను నిషేదిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ ఇవాళ్ళ ప్రకటించింది. ఆ మొబైల్ యాప్‌లను నిర్వహిస్తున్న చైనా సంస్థలు వాటి ద్వారా భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి చైనాకు అందజేస్తున్నాయని నిఘావర్గాలు హెచ్చరించడంతో వాటిని భారత్‌లో నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేదం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. 

సరిహద్దుల వద్ద చైనాత ఘర్షణలు మొదలైన తరువాత కేంద్రప్రభుత్వం తొలి హెచ్చరికగా చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 మొబైల్ యాప్‌లను నిషేధించింది. తాజాగా మరో 118మొబైల్ యాప్‌లను నిషేధించి చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది. అత్యంత ప్రజాధారణ ఉన్న పబ్జీ వంటి మొబైల్ యాప్‌లకు దేశంలో చాలా మంది యువత ‘అడిక్ట్’ అయిపోయి జీవితాలు నాశనం చేసుకొంటున్నారు. కనుక అటువంటి వారికి ఇప్పటికైనా ఆ వ్యసనం నుంచి బయటపడే అవకాశం లభించిందని భావిస్తే మంచిది.

ఇక ఈ చైనా మొబైల్ యాప్‌ల ద్వారా చైనా కంపెనీలు ఏటా కోట్లాది విదేశీ మారకం ఆర్జిస్తున్నాయి. అది చైనా ఆర్ధిక వ్యవస్థకు ఎంతో అండగా ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. భారత్‌ ఇప్పుడు చైనా ఆర్ధికమూలాలను దెబ్బ తీస్తూ చైనాను కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది.

భారత్‌ ఇటువంటి చవుకబారు ప్రయత్నాలు చేస్తుందని కానీ చైనాపై వాటి ప్రభావం ఎంతమాత్రం ఉండబోదని చైనా పాలకులు వాదిస్తున్నారు. ఓ పక్క చైనాకు నష్టం లేదని వాదిస్తూనే ఆ నిర్ణయంపై భారత్‌ పునరాలోచించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తుండటం గమనిస్తే చైనా చాలా నష్టపోతోందని, ఆ కంపెనీల నుంచి చైనా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందని అర్ధమవుతోంది.

భారత్‌ వ్యూహం బాగానే పనిచేస్తోంది కానీ భారతీయులకు మాత్రం చైనా సరుకుపై మోజు ఏమాత్రం తగ్గకపోవడం చాలా శోచనీయం. “భారతీయులు చైనా ఉత్పత్తుల గురించి చాలా చులకనగా మాట్లాడుతుంటారు కానీ వారు చైనా ఉత్పత్తులను కాదనలేరు. ఎందుకంటే తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తులు కావడమే అందుకు కారణం,” అని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అంటే భారతీయులు చైనాను శత్రువుగా చూస్తున్నప్పటికీ చైనా ఉత్పత్తుల మోజు నుంచి ఎన్నటికీ బయటపడలేరని చెప్పకనే చెపుతోంది.

కనుక ఇప్పుడు భారతీయులే ఆలోచించుకోవాలి. భారత్‌పై దురాక్రమణకి దిగడమే కాక మన దేశం, మన ప్రభుత్వం, మన గురించి ఇంత చులకనగా మాట్లాడుతూ మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న చైనాను ఇంకా నెత్తిన పెట్టుకొని మోద్దామా లేక మన దేశీయ ఉత్పత్తులను కొని ఆదరిస్తూ...మన దేశీయ కంపెనీలను కాపాడుకొంటూనే చైనాకు గట్టిగా బుద్ధి చెపుదామా? అని ప్రతీ ఒక్కరు ఆలోచించుకోవాలి. 


Related Post