భారత్‌ చాలా తెలివితక్కువగా వ్యవహరిస్తోంది: చైనా

September 05, 2020


img

భారత్‌-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్న ఘర్షణలకు కారణం మీరంటే మీరేనని భారత్‌ చైనాలు వాదించుకొంటున్నాయి. అయితే ప్రపంచదేశాలకు కరోనాను అంటించిన చైనా అందుకు ఏమాత్రం పశ్చాతపం వ్యక్తం చేయకపోగా, ఇదే అదునుగా కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్‌ను నిశబ్ధంగా కబళించేందుకు కుట్రపన్ని, తన సైన్యాన్ని, యుద్ధ విమానాలను సరిహద్దులకు వద్దకు పంపించడంతోనే ఈ ఘర్షణలు మొదలయ్యాయని అందరికీ తెలుసు. 

చైనా సేనలు భారత్‌ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. చైనా దురాక్రమణలను అడ్డుకొనే ప్రయత్నంలో కల్నల్ సంతోష్ బాబుతో సహా మొత్తం 22 మంది భారత్‌ జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. అంతర్జాతీయ సమాజం తప్పుపడుతున్నప్పటికీ చైనా తీరు మారలేదు పైగా ఇంకా బరితెగించి భారత్‌తో ప్రత్యక్ష యుద్ధానికి సిద్దం అవుతోంది. 

గతంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు భారత ప్రభుత్వం శాంతిప్రవచనాలు వల్లెవేస్తుండేది. అప్పుడు చైనా సైనికులు చల్లగా భారత్‌ భూభాగాలను ఆక్రమించుకొంటుండేవారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం చైనాకు చాలా ధీటుగా జావాబిస్తుండటంతో చైనా సహించలేకపోతోంది. చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక ఆ అక్కసు అంతా వెళ్లగక్కింది. 

మంగళవారం ప్రచురింపబడిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తాజా సంచిక సాంపాదకీయంలో భారత్‌ గురించి చైనా వ్యక్తం చేసిన అభిప్రాయాలు క్లుప్తంగా… 

• సరిహద్దుల వద్ద భారత్‌ దుందుడుకు చర్యలతో దశాబ్ధాలుగా నెలకొన్న ప్రశాంతత చెదిరిపోయి తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది రెండు దేశాలకు మంచిది కాదు. 

• సరిహద్దు సమస్యలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా అమెరికాతో చైనాపై ఒత్తిడి చేయించడం ద్వారా భారత్‌ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తోంది. ఇది వెర్రితనమే.  

• భారత్‌ జాతీయవాదం భారత్‌కే ముప్పు.  

• భారత్‌ జీడీపీలో 2.4 శాతం అంటే 71.1 బిలియన్ డాలర్లు రక్షణ రంగానికి కేటాయిస్తోంది. కానీ దానిలో అధికశాతం సరిహద్దుల వద్ద ఇరుగుపొరుగు దేశాలతో కయ్యాల కోసమే ఖర్చు చేస్తోంది. 

• అమెరికా వంటి దేశాలను నమ్ముకొని భారత్‌ చైనాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. కానీ భారత్‌కు అమెరికా ఎందుకు సాయం చేస్తుంది? పైగా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న అమెరికా భారత్‌ను తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు ప్రయత్నించడం ఖాయం. 

• భారత్‌ చేస్తున్నట్లే చైనా కూడా పాకిస్థాన్‌ వంటి దేశాలను పోగుచేసి భారత్‌పై ఒత్తిడి చేయగలదు కానీ చైనా ఎన్నడూ అటువంటి దురాలోచనలు చేయదు. ఎందుకంటే ఇటువంటి సవాళ్ళను స్వయంగా ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలు చైనాకు పుష్కలంగా ఉన్నాయి కనుక. 

•  భారత్‌ చైనాతో ఏనాడూ పోటీ పడలేదు ఎందుకంటే భారత్‌ కంటే చైనా అన్ని రంగాలలో చాలా అభివృద్ధి చెందింది. చైనా ఎల్లప్పుడూ ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబందాలు, వాటితో కలిసికట్టుగా అభివృద్ధి సాధించాలని కోరుకొంటుంది. 

• భారత్‌లో కోట్లాదిమంది ప్రజలు దారిద్ర్యంతో బాధపడుతున్నారు. ఉండటానికి కనీసం ఇళ్ళులేనివారు భారత్‌లో కోట్లమంది ఉన్నారు. వారి గురించి, దేశాభివృద్ధి గురించి ఆలోచించకుండా అమెరికా అండగా నిలబడుతుందనే గుడ్డి నమ్మకంతో ‘జాతీయ భద్రత’ సాకుతో  చైనాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌ తన ప్రాధాన్యతలను గుర్తించలేని పరిస్థితిలో ఉండటం చాలా శోచనీయం. 

• భారత్‌ ఈవిధంగా దుందుడుకుగా వ్యవహరిస్తుంటే చైనా ఒక్కటే శాంతినెలకొల్పలేదని భారత్‌ గుర్తించాలి. 

• భారత్‌ ధోరణి చూస్తుంటే అది తప్పుదోవలో నడుస్తోందనిపిస్తుంది.  

• భారత్‌-చైనాలు ఇరుగుపొరుగు దేశాలు. ఈ భౌగోళిక వాస్తవికతను ఎవరూ మార్చలేరని భారత్‌ గ్రహిస్తే మంచిది. కాదని చైనాతో కయ్యానికి కాలుదువ్వితే ఈసారి భారత్‌ చాలా భారీ మూల్యం చెల్లించడానికి సిద్దపడాలి.


Related Post