సచివాలయం ఆవరణలో ఉన్న రెండు మసీదులను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేయడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు (ఏఐఎంపిబి) తప్పుపడుతూ ఆగస్ట్ 16న ఓ తీర్మానం చేసింది. కూల్చివేసిన చోటే మళ్ళీ మసీదు పునర్నిర్మించే విషయంపై రెండువారాలలోగా ప్రభుత్వం నిర్ధిష్ట ప్రకటన చేయాలని లేకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. అయితే మసీదులను పునర్నిర్మిస్తామని సిఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించినందున ఏఐఎంపిబి హెచ్చరికపై ప్రభుత్వం మళ్ళీ స్పందించలేదు.
ఈ సమస్యపై సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పోరాటానికి సిద్దమయ్యారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రెండు మసీదులను పునర్నిర్మించాలంటూ ఏఐఎంపిబి విజ్ఞప్తి చేసినప్పటికీ సిఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకు సిఎం కేసీఆర్‌తో దోస్తీ ఉన్నందున ఈ సమస్యపై ఆయన కూడా నోరు మెదపడం లేదు. పైగా మేము మసీదుల పునర్నిర్మాణానికి పోరాడుతుంటే అసదుద్దీన్ ఓవైసీ మా పోరాటాన్ని దెబ్బ తీసేవిధంగా మాట్లాడుతున్నారు. ఏఐఎంపిబి ప్రభుత్వాన్ని వివరణ కోరితే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మసీదులను నిర్మిస్తుందంటూ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటన చేశారు. తద్వారా మసీదుల పునర్నిర్మాణం కోసం పోరాటం మొదలుపెట్టిన ముస్లింలలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారు. దీనిని మేము ఖండిస్తున్నాము. అసదుద్దీన్ ఓవైసీ మౌనంగా ఉన్నా పరువాలేదు కానీ మా పోరాటాన్ని దెబ్బ తీయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నిజానికి సిఎం కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీకు ముందుగానే తెలియజేసి సచివాలయంలో రెండు మసీదులను కూల్చివేసి, మర్నాడు శిధిలాలు పడి పొరపాటున కూలిపోయాయని అబద్దం చెప్పారని మేము భావిస్తున్నాము. అసదుద్దీన్ అనుమతితోనే ప్రభుత్వం సచివాలయంలో మసీదులను కూల్చివేసింది కనుకనే ఆయన మౌనంగా ఉండిపోయారని భావిస్తున్నాము. ఇకనైనా సిఎం కేసీఆర్ రెండు మసీదుల పునర్నిర్మాణంపై నిర్ధిష్టమైన ప్రకటన చేయాలి లేకుంటే నిరసన కార్యక్రమాలు చేపడతాము,” అని షబ్బీర్ అలీ హెచ్చరించారు.