శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ టిఆర్ఎస్ అధిష్టానం తీరుపై గత కొన్నిరోజులుగా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రముఖ తెలుగు పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న నావంటివారిని కాదని ఉద్యమాలను అవహేళన చేసినవారికి ప్రభుత్వంలో కీలకపదవులు ఇస్తుండటం చాలా బాధాకరం. 2018 శాసనసభ ఎన్నికలలో నాకు చేవెళ్ళ నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని సిఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో నన్ను పక్కన పెట్టి వేరేవారికి ఇచ్చారు. సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను కానీ లభించడం లేదు. నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మరి ఇతరుల మాటేమిటి? పార్టీలో ఉద్యమకారులకు, బడుగు బలహీనవర్గాలకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదు. కనీసం ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్ పార్టీలో ఉద్యమకారులను, బడుగు బలహీనవర్గాల నేతలతో మాట్లాడి వారికి పార్టీలో, ప్రభుత్వంలో సముచిత ప్రాధాన్యం కల్పించాలి. టిఆర్ఎస్ అధిష్టానం తీరుపట్ల నేను కాస్త అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం కానీ పార్టీ మారే ఆలోచన లేదు. ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగుతాను,” అని అన్నారు.
గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగువెలిగిన కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ ఎస్. మధుసూధనాచారి, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, రాజయ్య, డీ శ్రీనివాస్ వంటి ప్రముఖులు ఎందరినో 2018 ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్ పూర్తిగా పక్కనపెట్టారు. వారిలో స్వామి గౌడ్ కూడా ఒకరు. కనుక వారు అసంతృప్తి చెందటం సహజమే. కానీ వారిలో స్వామిగౌడ్ ఒక్కరే బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాచేస్తే ఆయనకు రెండే ఆప్షన్లు ఉంటాయి. మొదటిది: పార్టీని వీడి వెళ్ళిపోవడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడటం. రెండో ఆప్షన్: ఒకవేళ అదృష్టం బాగుంటే ఏదో ఓ నామినేటడ్ పదవి లభిస్తుంది. సిఎం కేసీఆర్, కేటీఆర్‌లను తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని మెచ్చుకొంటూ స్వామిగౌడ్ మాట్లాడటం నిజమైతే ఆయనకు ఒకే ఒక ఆప్షన్ మిగిలి ఉంది. అదే మొదటి ఆప్షన్!