దేశంలో ఈ నెలాఖరుతో అన్‌లాక్-3 పూర్తయ్యి సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్-4 మొదలవుతుంది. ఈసారి ఆర్టీసీ సిటీ బస్సులు, మెట్రో ఎంఎంటిఎస్ రైళ్ళు వంటి ప్రజారవాణా వ్యవస్థలపై నిషేధం ఎత్తివేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కావో నేడో రేపో కేంద్రం ప్రకటిస్తే తేలిపోతుంది. కేంద్రప్రభుత్వం అనుమతిస్తే మెట్రో రైళ్ళను నడిపేందుకు మెట్రో అధికారులు, సిబ్బంది సిద్దంగానే ఉన్నారు. కానీ ఎంఎంటిఎస్ రైళ్ళలో, సిటీ బస్సులలో భౌతికదూరం పాటించడం సాధ్యం కాదు కనుక వాటిని ఏవిధంగా నడిపించాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు, సిబ్బంది చర్చించుకొంటున్నారు.
ఇప్పటికే 6 నెలలుగా సిటీ బస్సులు, ఎంఎంటిఎస్ రైళ్ళు డిపోలలోనే ఉండిపోవడంతో ఆ రెండు సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. కనుక వాటి మనుగడకు, వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగుల మనుగడ కోసం తప్పనిసరిగా సర్వీసులు ప్రారంభించవలసి ఉంటుంది. కానీ నేటికీ హైదరాబాద్‌లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున కిక్కిరిసి నడిచే సిటీ బస్సులలో, ఎంఎంటిఎస్ రైళ్ళలో చాలా సులువుగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. ఆర్టీసీలో దూరప్రాంతాల బస్సులు మాత్రమే నడుస్తుంటే సుమారు 600 మంది డ్రైవర్లు, కండెక్టర్లు, ఇతర సిబ్బంది కరోనాబారిన పడ్డారు, వారిలో కొంతమంది చనిపోయారు కూడా. కనుక సిటీ బస్సులను నడిపించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ఏమి చేయాలని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు, డిపోలలో పనిచేసే ఉద్యోగులే కాదు...ప్రయాణికులు కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఉంటుంది కనుక ప్రజలు సిటీ బస్సులు ఎక్కేందుకు భయపడవచ్చు. దీంతో ఆర్టీసీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. సాధారణ ప్యాసింజర్ రైళ్ళను సెప్టెంబర్ నెలాఖరు వరకు నడిపించకూడదని రైల్వేశాఖ ఇదివరకే ప్రకటించింది.