పీవీపై టిఆర్ఎస్‌కు హటాత్తుగా ఎందుకు ఇంత ప్రేమ పుట్టిందో?

August 29, 2020


img

దివంగత ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు గొప్పతనం అందరికీ తెలుసు. కానీ ఆయన చనిపోయినప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానమే పట్టించుకోలేదు. కారణాలు అందరికీ తెలుసు. అధిష్టానం పట్టించుకోకపోవడంతో రాష్ట్రస్థాయి కాంగ్రెస్‌ నేతలు కూడా ఆయన గురించి మర్చిపోయారు. కానీ తెలంగాణ ప్రభుత్వం హటాత్తుగా ఆయనను భుజానికెట్టుకొని ఏడాదిపాటు రాష్ట్రవ్యాప్తంగా పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించేసరికి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు షాక్ అయ్యారు. వెంటనే వారు కూడా హడావుడిగా పీవీ జయంతి ఉత్సవాలను జరుపుతామని ప్రకటించేరు. 

తెలంగాణకు చెందిన పీవీ దేశంలో అత్యున్నత పదవి చేపట్టి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని, ఆయన తెలంగాణకు గర్వకారణమని టిఆర్ఎస్‌ ప్రభుత్వం చెపుతోంది. అయితే గత 6 ఏళ్ళలో టిఆర్ఎస్‌కు ఈవిషయం ఎందుకు గుర్తుకురాలేదు? ఇప్పుడు హటాత్తుగా ఆయనను ఎందుకు భుజానికి ఎత్తుకొంది? పైగా నెహ్రూ, ఇందిరాగాంధీలను ద్వేషించే టిఆర్ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పీవీకి ఇప్పుడు ఎందుకు భజన చేస్తోంది?అనే సందేహాలు కలగడం సహజం.

ప్రముఖ ఆన్‌లైన్‌ ఆంగ్ల దినపత్రిక సియాసత్. కామ్‌లో దీనిపై ఈరోజు ఓ ఆసక్తికరమైన కధనం ప్రచురించింది. దాని ప్రకారం, దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని టిఆర్ఎస్‌ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించడం. తద్వారా రాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంకును దెబ్బతీయడం. 

స్వర్గీయ పీవీ ప్రధానిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు కూల్చివేయబడింది కనుక హిందువులు ఆయనను అభిమానిస్తారనే నమ్మకంతో టిఆర్ఎస్‌ ఆయనను భుజానికెత్తుకొని ఉండవచ్చని సియాసత్ పేర్కొంది. హిందుత్వ అజెండాతో ముందుకు సాగే బిజెపి సహజంగానే రాష్ట్రంలో హిందూ ఓట్లపైనే ఆధారపడుతుంది. కనుక హిందూ బ్యాంకును ఆకర్షించడానికి పీవీని బిజెపి భుజానికెత్తుకోకమునుపే టిఆర్ఎస్‌ ఎత్తుకొని బిజెపి కాళ్ళ కింద చాపను లాగేసిందని సియాసత్ పేర్కొంది.   

కానీ బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు స్వర్గీయ పీవీని విపరీతంగా ద్వేషిస్తున్న మజ్లీస్ పార్టీతో కూడా టిఆర్ఎస్‌ స్నేహం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బహుశః అందుకే మజ్లీస్ పార్టీ పీవీ జయంతి ఉత్సవాల నిర్వహణపై మౌనం వహించి ఉండవచ్చు. మజ్లీస్‌తో స్నేహం ద్వారా రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకును, పీవీని భుజానికెత్తుకోవడం ద్వారా హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకొని రాష్ట్రంలో తనకు తిరుగులేకుండా చూసుకోవాలని టిఆర్ఎస్‌ తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోందని సియాసత్ అభిప్రాయం వ్యక్తం చేసింది. పీవీని హటాత్తుగా టిఆర్ఎస్‌లో భుజానికెత్తుకోవడానికి కారణం ఇదేనని ఆ పార్టీలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ నేత చెప్పినట్లు సియాసత్ పేర్కొంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే స్వర్గీయ పీవీ కుమార్తె వాణీ దయాకర్ రావుకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సియాసత్ పేర్కొంది. 

ఒక ఒరలో రెండు కత్తులే ఇమడవు కానీ సిఎం కేసీఆర్‌ మాత్రం అలవోకగా అనేక కత్తులను ఇమిడ్చి చూపిస్తున్నారు. అటు మోడీ ప్రభుత్వాన్ని, ఇటు దానిని ద్వేషించే మజ్లీస్ పార్టీని, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ పార్టీని కూడా ఒకే ఒరలో ఇమిడ్చి చూపిస్తున్నారు. అది కేవలం ఆయనకే చెల్లు. 

కానీ వివిద పార్టీలు, కులాల మద్య చీలిపోయున్న హిందువులను బిజెపియే ఆకర్షించలేకపోతున్నప్పుడు పీవీ జయంతి ఉత్సవాలతో టిఆర్ఎస్‌ ఆకర్షించడం సాధ్యమేనా? సాధ్యమే అయితే బిజెపి ఆ పని ఎప్పుడో చేసి ఉండేది కదా?


Related Post