ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళకండి: మంత్రి ఈటల

August 28, 2020


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని కాలనీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, “కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను పీడించుకొని తింటున్నాయి. లక్ష రూపాయలు మాత్రమే అయ్యే చికిత్సకు సుమారు 30 లక్షలు వసూలు చేస్తుండటం చాలా దారుణం. కనుక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి అప్పులపాలవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.    ప్రభుత్వాసుపత్రులలో కరోనా చికిత్సకు అవసరమైన సకల సౌకర్యాలు, నిపుణులైన వైద్యులు ఉన్నారు. కరోనా సోకితే ప్రభుత్వాసుపత్రులలోనే చేరవలసిందిగా కోరుతున్నాను. ప్రజలందరికీ వైద్యసదుపాయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే బస్తీ దవాఖనాలు ఏర్పాటు చేశాము. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 200 బస్తీ దవాఖానాలున్నాయి. నగరంలో మొత్తం 145 కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాము. కరోనా రోగులకు మరింత సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. కాలనీలలో కమ్యూనిటీ హాల్స్ లో క్వారెంటైన్‌ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తే ప్రభుత్వం రోగులకు అవసరమైన మందులు, ఆహారం వగైరా అన్ని అందజేయడానికి సిద్దంగా ఉంది. అందరం కలిసికట్టుగా పోరాడితే కరోనాను నివారించడం పెద్ద కష్టమేమీ కాదు,” అని అన్నారు. 

సామాన్య ప్రజలు ఎవరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోవాలనుకోరు. కానీ ప్రభుత్వాసుపత్రులలో వసతులు లేవనో లేదా చేరితే ఎవరూ పట్టించుకోరనే భయంతోనో లేదా ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్చుకోవడానికి వైద్యులు నిరాకరించడం వలననో విధిలేని పరిస్థితులలో ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి దోపిడీ చేయబడుతున్నారు. ఈవిషయం మంత్రి ఈటల రాజేందర్‌కు తెలియదనుకోలేము. సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పదేపదే హెచ్చరిస్తున్నా ప్రైవేట్ ఆసుపత్రులు ఏమాత్రం భయపడకుండా రోగులను దోచుకొంటున్నాయంటే హైకోర్టు చెప్పినట్లు అవి ప్రభుత్వం కంటే చాలా శక్తివంతమైనవని భావించవలసి ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను దోచుకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుంటే అది ఆయన నిసహాయతకు అద్దం పడుతుంది కనుక ప్రజలు నవ్వుకొంటారు. అదే ప్రైవేట్ ఆసుపత్రులపై కటినచర్యలు తీసుకొని వాటిని దారిలో పెట్టి మాట్లాడితే అందరూ హర్షిస్తారు. 

ఓ పక్క రోజుకు సుమారు 2,000 మందికి పైగా కరోనా బారినపడుతుంటే ప్రభుత్వాసుపత్రులలో ఎప్పుడూ వందల సంఖ్యలో బెడ్లు ఖాళీగా పడున్నాయని హెల్త్ బులెటిన్‌లలో చెప్పుకోవడం ప్రభుత్వానికి గర్వకారణం కాబోదు. నిజానికి అది అతి పెద్ద లోపంగా భావించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతమంది కరోనా రోగులున్నప్పుడు ప్రభుత్వాసుపత్రులలో వందల సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఎందుకు ఉంటున్నాయి?అని మంత్రి ఈటల రాజేందర్‌కు సందేహం కలగకపోవడం విడ్డూరంగా ఉంది. ఆసుపత్రులలో వందల సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నాయని, ఎంతమంది వచ్చినా వైద్యం అందించగలమని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం కోసమే సామాన్య ప్రజలను ప్రభుత్వాసుపత్రులలో చేర్చుకోవడం లేదా సామాన్య ప్రజలు సైతం లక్షలు ఖర్చుపెట్టి ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకొనే స్థాయికి ఎదిగిపోయారా?అని ప్రశ్నించుకొంటే సమాధానం తెలుస్తుంది. అసలు రోజూ ఎంతమంది కరోనా రోగులు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు?వారిలో ఎంతమందిని చేర్చుకొంటున్నారు?అని నిజాయితీగా ప్రశ్నించుకొన్నా ఈ పరిస్థితులలో చాలా మార్పు వచ్చేది.


Related Post