భారత్ ఏ ముహూర్తన్న చైనా మొబైల్ యాప్‌లపై నిషేదం విధించిందో కానీ అప్పటి నుంచి చైనా యాప్‌లకు కష్టకాలం మొదలైంది. అమెరికా కూడా భారత్ బాటలోనే నడుస్తూ టిక్‌టాక్‌పై నిషేదం విధించడానికి సిద్దపడింది. కానీ దాని యాజమాన్యపు హక్కులను అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే యధాప్రకారం నడిపించుకొనేందుకు అనుమతిస్తానని ట్రంప్ సర్కార్ చెప్పడంతో మైక్రోసాఫ్ట్ సంస్థ రంగంలో దిగి టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు మొదలుపెట్టింది. దాని సంగతి ఇంకా తెలకమునుపే ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు చైనాకు చెందిన ‘వియ్ చాట్’ యాప్‌పై కూడా నిషేధం విధించడానికి సిద్దం అవుతోంది.
దాంతో చైనా ఆగ్రహంగా స్పందించింది. “ఒకవేళ అమెరికా ప్రభుత్వం వియ్ చాట్‌ను నిషేధించదలిస్తే, మా దేశస్థులు అమెరికాకు చెందిన ఐ ఫోన్స్, యాపిల్ ప్రొడక్ట్స్ వాడటంలో అర్ధం లేదు,” అని ట్విట్టర్‌లో హెచ్చరించారు. అంటే అమెరికాలో వియ్ చాట్ నిషేధిస్తే, చైనాలో ఐ ఫోన్స్, యాపిల్ ప్రొడక్ట్స్ పై నిషేధం విధిస్తామని హెచ్చరిస్తోంది.
అమెరికా, చైనాల మద్య జరుగుతున యుద్ధం నిజంగా ఆ యాప్‌ల కోసమేనా లేకా వెనక ఇంకేమైనా కారణాలున్నాయా? అంటే నవంబర్ 3న జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలు కనిపిస్తున్నాయి. ఆ ఎన్నికలలో ఏదో విధంగా గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న డోనాల్డ్ ట్రంప్, అమెరికన్ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ది పొందేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వియ్ చాట్‌పై నిషేధం విధిస్తే అప్పుడు చైనా కూడా అమెరికా కంపెనీల ఉత్పత్తులపై నిషేధం విదిస్తుంది. దాంతో అమెరికన్లలో సెంటిమెంటు రగిలి చైనాతో పోరాడుతున్నందుకు డోనాల్డ్ ట్రంప్‌కు ఓట్లేసి గెలిపించవచ్చు. కానీ మద్యలో వియ్ చాట్, యాపిల్ నలిగిపోతాయి పాపం!