పార్టీని సమూలంగా ప్రక్షాళించవలసిందే: గులాం నబీ ఆజాద్

August 28, 2020


img

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే మళ్ళీ కొనసాగించడం ద్వారా పార్టీలో మొదలైన అసమ్మతి సెగలు ఆర్పివేశామని అధిష్టానం భావించి ఉండవచ్చు. కానీ అసమ్మతి సెగలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న 26 మంది సీనియర్ నేతలలో ఒకరైన మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఇవాళ్ళ మళ్ళీ మరో బాంబు పేల్చారు. 

ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఇదేవిధంగా కొనసాగినట్లయితే మరో 50 ఏళ్ళపాటు ప్రతిపక్ష బెంచీలలోనే కూర్చోవలసి ఉంటుంది. పార్టీలో ఎన్నో ఏళ్లుగా సంస్థాగత ఎన్నికలు జరుగడంలేదు. పార్టీలో సరైన నాయకత్వం, మార్గదర్శనం చేసేవారు లేక నేతలు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కనుక పిసిసి స్థాయి నుంచి ఏఐసిసి స్థాయి వరకు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలి. పార్టీ అధ్యక్షులను ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలి. వారు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసేవారై ఉండాలి. పార్టీకి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమర్ధమైన నాయకత్వం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నూతన విధానాలు, ఆలోచనలు అవసరం. పార్టీని కింద నుంచి పైవరకు సమూలంగా ప్రక్షాళన చేయవలసిందే లేకుంటే పార్టీ మనుగడ కష్టమే,” అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ గురించి గులాంనబీ ఆజాద్ చెప్పింది నిజమేనని అందరికీ తెలుసు. కానీ పార్టీలో చాలా మంది సోనియా, రాహుల్ నాయకత్వానికి, మూస రాజకీయాలకు అలవాటుపడినందున పార్టీ నష్టపోతోందని తెలిసినా పార్టీలో ఎటువంటి మార్పులను అంగీకరించలేకపోతున్నారు. దాంతో వారి కళ్ళముందే కాంగ్రెస్‌ కుప్పకూలిపోతోంది. అయినా ఎవరూ కూడా మేల్కొని ధైర్యం చేసి పిల్లి మెడలో గంట కట్టే సాహసం చేయలేకపోయారు. ఇన్నాళ్ళకు గులాంనబీ ఆజాద్ ఆ పని చేస్తున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకాలు పార్టీకి నాయకత్వం వహించబోమని చెపుతున్నప్పుడు, ధైర్యంగా ముందుకు వచ్చిన గులాంనబీ ఆజాద్‌కే ఆ బాధ్యతలు అప్పగించవచ్చు. కానీ తాము పార్టీ పగ్గాలు చేపట్టబోమని చెపుతూనే ముందుకువచ్చిన ఆజాద్ వంటి సీనియర్లపై కన్నెర్ర చేస్తున్నారు. అధిష్టానం తీరును తప్పు పడుతున్నందుకు బహుశః ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి మళ్ళీ మూసపద్దతిలోనే సాగిపోతుందేమో? నాయకత్వ మార్పుకు, కొత్త ఆలోచనలకు, విధానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం అంగీకరించకపోతే ఆజాద్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండిపోవలసి వస్తుంది.


Related Post