దయచేసి ఆ వార్తలు వ్రాయకండి: అదర్‌ పూనావాల్ల

August 28, 2020


img

కరోనా సోకకుండా నివారించేందుకు తయారుచేసిన ‘కోవాక్సిన్’; ‘కోవీషీల్డ్’ మరో రెండుమూడు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌ దేశవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ వివరాలు, క్లినికల్ ట్రయల్స్‌ పురోగతికి సంబందించి వార్తలు మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయితే కీలకమైన ఈ దశలో క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు ఇస్తున్న వ్యాక్సిన్‌, దాని ఫలితాల గురించి మీడియాలో ప్రచురించడం మంచిదికాదని ‘కోవీషీల్డ్’ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయబోతున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాల్ల అన్నారు. తద్వారా ఈ వ్యాక్సిన్‌ తయారీ, క్లినికల్ ట్రయల్స్‌ ప్రక్రియపై ఒత్తిడి పెరుగుతుందని, ఆవిధంగా జరగడం ఎవరికీ మంచిది కాదని కనుక అటువంటి వార్తలు ప్రచురించవద్దని అదర్ పూనావాళ్ళ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తి శాస్త్రీయపద్దతిలో కొనసాగేందుకు సహకరించాలని ఆయన కోరారు.  ఒక్క రెండు నెలలు ఓపిక పడితే ఈ వ్యాక్సిన్‌, క్లినికల్ ట్రయల్స్‌కు సంబందించి పూర్తి శాస్త్రీయ సమాచారాన్ని మేమే అందజేస్తామని అదర్ పూనావాల్ల అన్నారు.           

 గతంలో కూడా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియాతో సహా దేశంలో పరిశోధనా కేంద్రాలలో అనేక రకాల వ్యాక్సిన్లు తయారయ్యాయి. కానీ ఆ రోగాలేవీ కరోనా అంత విపత్తు సృష్టించలేదు కనుక వ్యాక్సిన్‌ పరిశోధనలు, తయారీ, క్లినికల్ ట్రయల్స్‌, ఉత్పత్తి అన్నీ కూడా శాస్త్రీయపద్దతిలో చాలా నిశబ్ధంగా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి కనుక మీడియా కూడా దీనిపై చాలా ఎక్కువగా దృష్టిపెట్టి వ్యాక్సిన్‌కు సంబందించి ప్రతీ విషయాన్ని ప్రచురిస్తున్నాయి. ఇటువంటి వార్తల వలన వ్యాక్సిన్‌ అనుకొన్న సమయం కంటే ముందుగా ఏమీ రాదు పైగా వ్యాక్సిన్‌ తయారీదారులపై ఒత్తిడి పెరిగిపోతే తప్పులు జరుగవచ్చు అప్పుడు వ్యాక్సిన్‌ ఇంకా ఆలస్యం కావచ్చు. కనుక అదర్ పూనావాల్ల చెప్పినట్లు ఈవిషయంలో మీడియా కొంత సంయమనం పాటిస్తే మంచిది.


Related Post