భారత్‌లో పాజిటివ్ కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయి?

August 28, 2020


img

భారత్‌లో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 75,760 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో ‘రోజుకు నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య’ వేగంగా పెరుగుతూనే ఉంది. వారం రోజుల క్రితం వరకు రోజుకు 60,000 కేసులు నమోదవుతుండగా, నిన్న ఒక్కరోజే ఏకంగా 75,760 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసులు పెరుగుతున్న తీరును గమనిస్తే ఇక నుంచి ప్రతీరోజూ దేశంలో ఇదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉండవచ్చు. ఇలా పెరుగుతూ...పెరుగుతూ త్వరలోనే రోజుకు లక్ష పాజిటివ్ కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదు. కరోనా కట్టడికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతున్నాయి. అందుకు అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

1. దేశంలో తగినన్ని ఆసుపత్రులు, వైద్యులు, వైద్యసిబ్బంది లేకపోవడం. 

2. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కరోనా చికిత్సకు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటం

3.  కరోనా పరీక్షలు, చికిత్సల భారం భరించలేకపోతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతల నుంచి మెల్లగా పక్కకు తప్పుకొంటుండటం. 

4. ఈ కారణాల వలన దేశంలో ప్రజలందరికీ కరోనా పరీక్షలు, చికిత్సలు అందుబాటులో లేకపోవడం.           

5. దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతుండటంతో కరోనా సోకినా కొలుకొంటామని ప్రజలలో ధీమా పెరగడంతో నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాలలో తిరుగుతుండటం. 

6. పేదరికం కారణంగా కరోనా జాగ్రత్తలు పాటించలేకపోవడం. 

7. కొన్ని పని ప్రదేశాలలో ఎటువంటి కరోనా జాగ్రతలు తీసుకోకుండా పనిచేయవలసి వస్తుండటం.

ఇటువంటివన్నీ దేశంలో పాజిటివ్ కేసులు పెరిగేందుకు కారణమని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదనుకోలేము. కానీ ఈ లోపాలను, సమస్యలను అధిగమించేందుకు అవి చిత్తశుద్ధితో ప్రయత్నించే బదులు వాటిని గణాంకాలతో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుండటం వలననే దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. నిప్పును జేబులో దాచిపెట్టుకొంటే అది ఆరిపోదు...ఒళ్ళు కాలుతుంది. కరోనా విషయంలోనూ ఇప్పుడు దేశంలో అదే జరుగుతోందని చెప్పవచ్చు. 


Related Post