తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, విధానాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఇద్దరు కేంద్రమంత్రులు మెచ్చుకొన్నారు.
కేంద్రపరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం రాష్ట్రాల పరిశ్రమల శాఖల మంత్రులతో ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రోడక్ట్’ అనే అంశంపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న టిఎస్ ఐపాస్ పాలసీ (పారిశ్రామిక విధానం) చాలా అద్భుతంగా ఉందని, ఆ విధానానికి సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. దానిపై అధ్యయనం చేసి వీలైతే జాతీయ స్థాయిలో దానిని అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. టిఎస్ ఐపాస్ పాలసీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, అటువంటి మంచి పాలసీని రూపొందించినందుకు మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలియజేశారు.
మనదేశం పారిశ్రామికంగా స్వయంసంవృద్ధి సాధించి ‘ఆత్మనిర్భర్ భారత్’గా ఎదగాలంటే ముందుగా మౌలికవసతుల కల్పన చేయవలసిందేనని, అప్పుడే అది సాధ్యం అవుతుందని ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగితే అది దేశానికి కూడా ఎంతో లబ్ధి కలిగిస్తుంది కనుక ఈవిషయంలో తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం అన్నివిధాల సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు.
దేశంలో వ్యవసాయ రంగంలో మౌలికవసతులను అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం ‘అగ్రికల్చర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ స్కీమ్’ పేరిట ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని భావిస్తోంది. దాని గురించి దేశంలో వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయశాఖ మంత్రులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం అమలుచేస్తున్న రైతుబంధు పధకం చాలా బాగుందని, అలాగే రైతు సమన్వయసమితిలను ఏర్పాటు చాలా చక్కటి ఆలోచన అని ప్రశంశించారు. రైతుబంధు, రైతు సమన్వయ సమితిల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఏవిధంగా రైతులు లబ్ధి పొందుతున్నారో కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ప్రజంటేషన్ ద్వారా ఇతర రాష్ట్రాల మంత్రులకు వివరించడం విశేషం.
కేంద్రమంత్రులు ఇంత స్పష్టంగా, బహిరంగంగా తెలంగాణ ప్రభుత్వ పనితీరు, విధివిధానాలు, సంక్షేమ పధకాలను మెచ్చుకొని వాటిని ఆదర్శంగా తీసుకొని జాతీయస్థాయిలో కూడా అమలుచేయాలని చెపుతున్నప్పుడు, రాష్ట్ర బిజెపి నేతలు, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఘోరంగా విఫలమైందని, అవినీతిలో కూరుకుపోయిందటూ నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.