ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీంకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకొన్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో పరిపాలనా రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, అమరావతి నుంచి సచివాలయం, ప్రభుత్వం ప్రధాన కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు సిద్దం అయ్యింది.
కానీ దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు నేటి వరకు స్టేటస్-కో (యధాతధస్థితి)ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టులో నేడు విచారణ జరుగబోతుండగా దీనిపై సుప్రీంకోర్టుకు రావడం తగదని, ఈదశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
హైకోర్టు స్టేటస్-కో గడువు నేటితో ముగియడంతో మళ్ళీ దానిని సెప్టెంబర్ 21 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. విశాఖకు రాజధాని తరలించాలని చాలా ఆత్రంగా ఉన్న జగన్ ప్రభుత్వానికి ఇది ఊహించని మరో పెద్ద షాక్ అనే భావించవచ్చు.
రాజధాని తరలింపుకు బ్రేకులు పడటమే కాక ఏపీ ప్రభుత్వానికి మరో కొత్త సమస్య కూడా మొదలైంది. రాజధానిని విశాఖకు తరలించవద్దని హైకోర్టు వారిస్తున్నప్పటికీ, ఏపీ ప్రభుత్వం విశాఖలో కాపులుప్పడ అనే ప్రాంతంలో ఓ భారీ ప్రభుత్వ అతిధిగృహం నిర్మిస్తోందంటూ పిటిషనర్ తరపు న్యాయవాది నితీశ్ గుప్తా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని కోర్టు ధిక్కారంగా భావించి రాష్ట్ర ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దానిపై స్పందించిన హైకోర్టు సెప్టెంబర్ 5వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మూడు రాజధానుల ప్రతిపాదనకు కేంద్రం అభ్యంతరం లేదని చెప్పడం, ఆ తరువాత దానికి గవర్నర్ ఆమోదం తెలుపడంతో ఇక అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపుకు ఎటువంటి అవాంతరాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే, హైకోర్టు ప్రభుత్వాన్ని అడుగు ముందుకు వేయకుండా కట్టడి చేస్తుండటం విశేషం.
రాజధాని తరలింపుపై ఈవిధంగా అభ్యంతరాలు తెలుపుతూ మున్ముందు మరిన్ని పిటిషన్లు దాఖలవవచ్చు. అదే కనుక జరిగితే ఏపీకి రాజధాని విషయంలో అయోమయం ఇంకా కొనసాగుతూనే ఉండవచ్చు. రాజధాని విషయంలో ఇటువంటి సంధిగ్ధత నెలకొని ఉన్నప్పుడు, ఏపీ ఏవిధంగా పారిశ్రామికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంది?ఎప్పటికి నిలదొక్కుకొంటుంది?అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ అనిశ్చిత స్థితిని చూసి విశాఖలో మళ్ళీ పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తారా? లేకుంటే విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగకమానదు.