తెలంగాణలో రెవెన్యూ, వాణిజ్యపన్నులు, పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖలలో గ్రూప్-1 స్థాయి అధికారుల నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (టీఏఎస్) అనే సరికొత్త విధానాన్ని అమలుచేయబోతోంది. పాత రెవెన్యూ చట్టంలో లోతుపాట్లను సరిదిద్ది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా రూపొందిస్తున్న కొత్త రెవెన్యూ చట్టంలో ఈ టీఏఎస్‌ను పొందుపరచనుంది. ఈ చట్టం శాసనసభ ఆమోదం పొంది అమలులోకి వస్తే డెప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి ఆ పై స్థాయి పదవులన్నీ టీఏఎస్ ద్వారానే భర్తీ చేయబడతాయి.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రాగానే రెవెన్యూశాఖలో పనిచేస్తున్న వీఆర్‌ఓలను పంచాయతీరాజ్ శాఖలో, అలాగే వీఆర్‌ఏలను నీటిపారుదలశాఖలకు బదలాయించనుంది. తహశీల్దార్ అధికారాలకు కోత విధించి, భూవివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించనుంది. భూవివాదాలను 40 రోజులలోగా కలెక్టర్లు పరిష్కరించవలసి ఉంటుంది.
ఈ కొత్త చట్టం రైతులకు చాలా మేలు చేసేవిధంగా రూపొందిస్తోంది ప్రభుత్వం. ఇది అమలులోకివస్తే వంశపారంపర్యంగా సంక్రమించిన భూములకు మరియు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు జరిపినప్పుడు ఎటువంటి దరఖాస్తు చేసుకోకుండానే ఆటోమేటిక్‌గా భూమి తాలూకు యాజమాన్యపు హక్కులు కొనుగోలుదారు పేరుపై బదిలీ (మ్యూటేషన్) చేసి, పాస్ పుస్తకం కూడా జారీ చేస్తారు. కనుక భూములు కొనుగోలు చేసిన రైతులు మ్యూటేషన్ కోసం ఎవరికీ లంచాలు ఇవ్వవలసిన అవసరం ఉండదు. అధికారుల చుట్టూ తిరగవలసిన పనిలేదు.
కొత్త రెవెన్యూ చట్ట ప్రకారం ఇకపై భూములను ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజావసరాలు, గ్రామ కంఠం భూములుగా వర్గీకరణ చేసి, క్రయవిక్రయాలు జరుగుతున్నప్పుడే ఆ భూమి కేటగిరీకి చెందిందో స్పష్టంగా పేర్కొంటారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో, ఆ తరువాత పాసు పుస్తకాలలో ఆ విషయం స్పష్టంగా పేర్కొంటారు. దాంతో వివాదాస్పద భూముల క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలో జరుగబోయే శాసనసభ సమావేశాలలో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర వేయగానే దానిని వెంటనే అమలులోకి తెచ్చేందుకు సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.