టిఆర్ఎస్‌ ఎంపీ కేశవ్‌రావుకే కుచ్చుటోపీ!

August 26, 2020


img

టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ సెక్రెటరీ జనరల్ అయిన కే. కేశవ్‌రావుకే ఓ మోసగాడు కుచ్చుటోపీ పెట్టేయాలని  ప్రయత్నించడం విశేషం.  రెండు రోజుల క్రితం మహేష్ అనే వ్యక్తి ఆయనకు ఫోన్‌ చేసి తాను కేంద్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్‌నని పరిచయం చేసుకొని, ప్రధాని రోజ్‌గార్ యోజన పధకం కింద కేకే ఎంపీ కోటాలో 20 మందికి రూ.25 లక్షలు చొప్పున రుణాలు మంజూరు అయ్యాయని తెలిపారు. కనుక రుణం అవసరమున్నవారి వివరాలు తెలియజేయాలని కోరారు. 

అతని మాటలు నిజమని నమ్మిన కేకే తన కుమార్తె విజయలక్ష్మికి ఆ బాధ్యత అప్పగించారు. ఆమె మహేష్‌తో  మాట్లాడినప్పుడు తాను మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు కేకేతో మాట్లాడానని చెప్పడంతో ఆమె కూడా అతని బుట్టలో పడిపోయారు. వెంటనే తమ అనుచరులైన పార్టీ కార్యకర్తలను పిలిచి రుణాల గురించి వారికి వివరించి ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోమని చెప్పారు. 

ఆమె చెప్పడంతో వారందరూ వెంటనే రుణం కోసం మహేష్‌కు ఫోన్‌ చేషారు. కానీ రుణాలు పొందాలంటే ఒక్కొక్కరూ రూ.1.25 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవలసి ఉంటుందని, కేవలం 20 మందికి మాత్రమే రుణాలు ఇస్తారు కనుక ఎవరు ముందుగా తన ఖాతాలో ఆ సొమ్మును జమా చేస్తారో వారికే ముందుగా రుణం పొందేందుకు అవకాశం ఉంటుందని ఆలస్యం చేస్తే అవకాశం కోల్పోతారని చెప్పాడు. అయినా వారెవరికీ అనుమానం కలుగకపోవడం విడ్డూరం. వారందరూ రూ.1.25 లక్షలు సిద్దం చేసుకొనేందుకు పరుగులు తీస్తుంటే వారిలో మేక అఖిల్ అనే కార్యకర్త ఆలస్యం చేయకుండా తన ఖాతాలో నుంచి రూ.50,000 మహేష్ ఖాతాలోకి బదిలీ చేసేశాడు. మరో రూ.50,000 మహేష్ ఖాతాలోకి బదిలీ చేయబోతుంటే విజయలక్ష్మి దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది....ఇదంతా మోసమని... మహేష్ ఖాతాలో డబ్బులు వేయవద్దని!

“కేంద్రప్రభుత్వ పధకాలు పొందేందుకు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు కదా?కానీ ఇతను ఫీజు అడుగుతున్నాడేమిటి?” అని కేకేకు చిన్న అనుమానం రావడంతో అతని బండారం బయట పడింది. ఆయన మళ్ళీ మహేష్‌కు ఫోన్‌ చేసి ఎక్కడున్నావని ప్రశ్నించగా...ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో ఉన్నానని అతను సమాధానం చెప్పాడు. అది నిర్ధారించుకొనేందుకు కేకే వెంటనే కేటీఆర్‌కు ఫోన్‌ చేశారు. కానీ కేటీఆర్‌ ఫోన్‌ కలవకపోవడంతో ఆయన కార్యదర్శికి ఫోన్‌ చేశారు. కేటీఆర్‌ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని చెప్పడంతో కేకేకు అంతా అర్ధమైపోయింది. ఆయన వెంటనే కుమార్తె విజయలక్ష్మికి జరిగిందంతా చెప్పి తమ అనుచరులేవరూ అతనికి డబ్బు చెల్లించకుండా ఆపాలని చెప్పడంతో ఆమె వెంటనే మేక అఖిల్‌కు ఫోన్‌ చేశారు. కానీ అప్పటికే అతను రూ.50,000 మహేష్ ఖాతాలోకి బదిలీ చేసేశాడు. మరో రూ.50,000 బదిలీ చేయబోతూ ఫోన్‌ కాల్ రావడంతో ఆగాడు కనుక ఆ డబ్బైనా మిగిలింది. లేకుంటే అదీ పోయేది. 

కేకే సూచన మేరకు మేక అఖిల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు వారు దర్యాప్తు చేయగా నిజామాబాద్‌లో సంజయ్ అనే వ్యక్తి ఖాతాలో ఆ డబ్బు జమా అయినట్లు గుర్తించి బ్యాంక్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు అతని ఖాతాను నిలిపివేశారు. అప్పటికే అతను తన ఖాతాలో నుంచి రూ.40,000 తీసి మిగిలిన రూ.10,000 కూడా తీసేందుకు ప్రయత్నించి విఫలమవడంతో తన ఖాతాను ఎందుకు నిలిపివేశారంటూ బ్యాంక్ సిబ్బందితో గొడవపడుతూ వారికి దొరికిపోయాడు. దాంతో ఈ ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన కథ ముగిసింది. 


Related Post