శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో డీఈ, ఏఈలతో సహా 9 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై సిఐడీ దర్యాప్తు చేస్తోంది. మరోపక్క అంతర్గతంగా ఓ నిపుణుల కమిటీ కూడా ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకొనేందుకు విచారణ జరుపుతోంది. వారి దర్యాప్తులో ఏమి తేలుతుందో తెలీదు కానీ ఈ ప్రమాదానికి అసలు కారణాలు మాత్రం అప్పుడే బయటపడ్డాయి.
మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద గల జెన్‌కో కాలనీలో జరిగిన సంతాప సభ జరిగింది. దానిలో అదే ప్లాంటులో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులు, వివిద ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రమాదంలో మరణించిన ఉద్యోగులకు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్లాంటులో జరుగుతున్న అవకతవకలను, వాటి వెనుకున్న అధికారుల పేర్లను కూడా బహిరంగంగా ప్రస్తావించడంతో సంతాపసభలో పాల్గొన్న ఉన్నతాధికారులు ఇబ్బంది పడ్డారు.
కొందరు ఉద్యోగులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి బ్యాటరీలు గుండెకాయ వంటివి. అవి పాడైపోయాయని, వెంటనే మార్చాలని మూడేళ్ళుగా మొత్తుకొంటున్నాము. కానీ ప్లాంటులో కొందరు అధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి పాడైపోయిన ఆ పాత బ్యాటరీలతోనే ప్లాంటును నడిపిస్తున్నారు. పాడైపోయిన పాత బ్యాటరీలను ఉపయోగించడం వలననే ఈ అగ్నిప్రమాదం జరిగి దానిలో తొమ్మిది మంది సహచరులను కోల్పోయాము. వారు ప్రమాదంలో చిక్కుకొన్నారని మాకు తెలిసినప్పటికీ మేము ఏమీ చేయలేక నిసహాయంగా ఉండిపోవలసి వచ్చింది. దీనికంతటికీ మూలకారకుడు జెన్‌కో సీఈ సురేష్ నాయక్. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి దానిలో 9 మంది చనిపోయారు. కనుక బాధ్యులపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇకనైనా ప్లాంటులో కొత్త బ్యాటరీలను, అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నాము,” అని అన్నారు.
ఈ సంతాపసభలో ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు సచ్చిదానందం, లక్ష్మయ్య , వెంకటరాజం, జగత్ రెడ్డి, సీఈలు సురేష్, ప్రభాకర్ రావు, టిఎస్ పీఈఏ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, వివిద ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.