నీట్, జేఈఈ పరీక్షల తేదీలలో ఎటువంటి మార్పులు ఉండబోవని, ఇటీవల ప్రకటించిన తేదీల ప్రకారమే పరీక్షలు నిర్వహించబోతున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఎ) స్పష్టం చేసింది. నేటికీ కరోనా వైరస్ వ్యాపించి ఉన్న నేపధ్యంలో పరీక్షలను మరికొంత కాలం వాయిదావేయాలని ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో సహా కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. కొందరు విద్యార్దులు కూడా ఈ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ కరోనాకు భయపడుతూ ఇలా ఎంతకాలం పరీక్షలు వాయిదా వేసుకొంటాము? ఇలా అయితే విద్యార్దుల విద్యాసంవత్సరం నష్టపోరా? కరోనా ఉందని తెలుసు కనుక అది సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ పరీక్షలు నిర్వహించడమే సరైన పడ్డతని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కనుక నీట్, జేఈఈ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి ఎన్‌టీఎ సిద్దం అవుతోంది.
సెప్టెంబర్ 1 నుంచి 6వరకు జేఈఈ (మెయిన్), సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు ఎన్‌టీఎ తెలిపింది. కనుక ఈ పరీక్షలు వ్రాసేందుకు విద్యార్దులు సిద్దంగా ఉండాలని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా సూచించింది.