భారత్-చైనాల సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి సుమారు మూడు నెలలుగా ఇరుదేశాల ఉన్నతస్థాయి సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. భారత్‌తో తాము ఎల్లప్పుడూ శాంతి, స్నేహాన్నే కోరుకొంటున్నామని, చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికే తాము మొగ్గు చూపుతున్నామని చైనా పాలకులు పదేపదే చెపుతున్నారు. కానీ భారత్ ఎంత ఒత్తిడి చేస్తున్నా సరిహద్దుల వద్ద తిష్టవేసుకొన్న చైనా సైన్యం ఏమాత్రం వెనక్కు వెళ్ళడం లేదు. పైగా అవి ఆక్రమించిన భారత్‌కు చెందిన భూభాగాలు తమవేనని గట్టిగా వితండవాదం కూడా చేస్తుండటంతో కేంద్రప్రభుత్వం సహనం నశించిపోతోంది.
చైనా తీరుపై త్రివిద దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ చేసిన తాజా వ్యాఖ్యాలు గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “చైనాతో సరిహద్దు సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మేము కోరుకొంటున్నాము. కానీ చైనా తీరు మారకపోతే సైన్యాన్ని రంగంలో దించి వారిని బలవంతంగా వెనక్కు పంపించవలసి వస్తుంది. కానీ అటువంటి పరిస్థితి రాకూడదనే మేము కోరుకొంటున్నాము,” అని అన్నారు.
ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడిగా బిపిన్ రావత్‌కు పేరుంది. ఆయన మిలటరీ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత ప్రధాని నరేంద్రమోడీ ఆయనను త్రివిద దళాధిపతిగా నియమించడమే అందుకు చక్కటి నిదర్శనం. కనుక బిపిన్ రావత్ వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయంగానే భావించవచ్చు.
అయితే చైనాను భారత్ ఎదుర్కోగలదా లేదా? ఒకవేళ ప్రత్యక్షయుద్ధం జరిగితే ఈసారి చైనాను భారత్ ఓడించగలదా లేదా?అనే విషయం పక్కనపెడితే, చైనా అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి భారత్ ఇప్పుడు ఏమాత్రం వెనకాడటం లేదని మోడీ ప్రభుత్వం నిరూపించి చూపుతోంది. ఇప్పటికే చైనా కంపెనీలపై, సేవలపై, మొబైల్ యాప్స్, కాంట్రాక్టులపై వరుసగా నిషేధాలు విధిస్తూ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మోడీ ప్రభుత్వం, ఒకవేళ సైన్యాన్ని ఉపయోగించి చైనా సేనలను సరిహద్దుల నుంచి బలవంతంగా వెనక్కు పంపించే ప్రయత్నం చేస్తే అది చైనాతో సహా యావత్ ప్రపంచానికి చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయమే అవుతుంది.