కాంగ్రెస్ పగ్గాలు మళ్ళీ సోనియా గాంధీకే అప్పగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఇవాళ్ళ సమావేశం మొదలైన తరువాత పార్టీ బాధ్యతలు ఎవరైనా స్వీకరించాలని ఆమె కోరినప్పటికీ అందరూ ఆమెనే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతూ తీర్మానం చేసి ఆమోదించారు. ఆమె కొన్ని నెలలు మాత్రమే పార్టీ బాధ్యతలు నిర్వహిస్తే ఆలోగా ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకొన్నారు.
పార్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి ఆమె ఆరోగ్యం సహకరించడంలేదని రాహుల్ గాంధీయే స్వయంగా చెపుతున్నారు. అయినా పార్టీలో ఎవరూ ఆ పదవి చేపట్టడానికి ముందుకు రాకపోవడం విశేషమే. టైటానిక్ వంటి మునిగిపోతున్న కాంగ్రెస్ నావను కాపాడేందుకు ‘కెప్టెన్’ వెనకాడుతున్నప్పుడు ఇంకెవరూ మాత్రం సాహసిస్తారు? అయినా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ముళ్ళ సింహాసనం వంటిదేనని చెప్పవచ్చు. దానిలో ఎవరు కూర్చోలేరు...ఒకవేళ ఎవరైనా ఎలాగో ఒకలాగా దానిలో కూర్చోవాలని ప్రయత్నించినా మిగిలినవారు ఊరుకోరు. పైగా ఆ కుర్చీకి రిమోట్ కూడా ఉంది. అది సోనియా, రాహుల్, ప్రియాంకాల చేతిలో ఉంటుంది కనుక కుర్చీలో కూర్చోన్నవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు. బహుశః అందుకే ఎవరూ ముందుకు రావడం లేదేమో? కాంగ్రెస్ నాయకత్వ సమస్య గురించి పార్టీ లోపల, బయటా అందరూ ఎప్పుడూ చర్చించుకోవడమే కానీ దశాబ్ధాలు గడుస్తున్నా ఏనాడూ దానికి ఓ పరిష్కారం కనుగొనలేకపోతుండటం కూడా ఆశ్చర్యకరమే. ఇవాళ్ళ కూడా అదే జరిగింది కనుక బహుశః ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుందేమో?