కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకత్వ మార్పుపై సుదీర్గంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సమావేశం మొదలవగానే సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని వేరేవారికి అప్పగించాలని కోరుతూ రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం...ఆ తరువాత కూడా సోనియా గాంధీ పార్టీని నడిపించిన మాట వాస్తవం. అలాగే పార్టీ ఓడిపోయిన తరువాత కూడా రాహుల్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించినమాట నిజం. కానీ వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికలలో పార్టీ ఓడిపోయి, మళ్ళీ ఎన్నటికీ కోలుకోలేని స్థితికి పార్టీ చేరుకొంటున్నప్పుడు, పార్టీని కాపాడుకోవలసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అస్త్రసన్యాసం చేసి పక్కకు తప్పుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే...కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే వారిరువురూ పార్టీ, ప్రభుత్వ పగ్గాలను వేరేవారికి అప్పగించేవారా?అంటే కాదనే చెప్పవచ్చు. పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సారధ్యం వహిస్తే మున్ముందు మరింత అప్రదిష్ట మూటగట్టుకోవలసి వస్తుందనే భయంతోనే వారు అస్త్ర సన్యాసం చేసినట్లు భావించవచ్చు.
రాహుల్ గాంధీ ఎప్పుడో అస్త్ర సన్యాసం చేసినప్పటికీ నేటికీ పార్టీ ఏవిధంగా నడవాలో...ఎవరు దానిని నడిపించాలో నిర్దేశిస్తుండటం చూస్తే, నేటికీ ‘రిమోట్’ తన చేతిలోనే ఉండాలని ఆయన కోరుకొంటున్నారని అర్ధమవుతోంది. ఆయన స్వయంగా పార్టీ బాధ్యతలు స్వీకరించరు కానీ స్వీకరించినవారు మాత్రం తన అదుపు ఆజ్ఞలలో ఉండాలని కోరుకొంటున్నారని అర్ధమవుతోంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆవిధంగా పనిచేస్తారు కనుకనే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టాలని సోనియా గాంధీ కోరి ఉండవచ్చు. పదేళ్ళ యూపీఏ పాలనలో ఆయన పేరుకే ప్రధాని కానీ దేశాన్ని, కేంద్రప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపించింది సోనియా గాంధీయే అని అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ దురదృష్టమేమిటంటే, సోనియా, రాహుల్, ప్రియాంకా వాద్రా ముగ్గురూ పార్టీ పగ్గాలు చేపట్టడానికి నిరాకరిస్తున్నప్పటికీ, పార్టీ పగ్గాలు చేప్పట్టడానికి పార్టీలో ఏ ఒక్కరూ ధైర్యంగా ముందుకురాలేకపోతున్నారు. లేదా రాహుల్ గాంధీకి మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పగించేందుకే అందరూ కలిసి ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారేమో?ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారో చూడాలి.