నాయకత్వ సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో తీవ్ర సమస్య ఎదురైంది. ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, పార్టీ ప్రక్షాళన చేయాలంటూ కొందరు సీనియర్లు సోనియా గాంధీకి లేఖ వ్రాయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “సోనియా గాంధీ ఆరోగ్యం బాగోనప్పుడు మీరు ఇటువంటి లేఖలు వ్రాయడం ఏమిటి? పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశాల గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని ఏమనుకోవాలి? మీరు బిజెపితో కుమ్మైకై ఈవిధంగా వ్రాసినట్లు ఎందుకు భావించకూడదు?” అని అన్నారని వార్తలు వచ్చాయి. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారో తెలియదు కానీ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్ ఇద్దరూ వెంటనే రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖలపై గులాంనబీ ఆజాద్ సమావేశంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. “30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడుతుంటే మాకు బిజెపితో సంబందం అంటగట్టడం చాలా బాధాకరం. ఒకవేళ మేము బిజెపితో కుమ్మకై లేఖ వ్రాసినట్లు నిరూపిస్తే నేను పార్టీకి రాజీనామా చేయడానికి సిద్దం,” అంటూ ఘాటుగా జవాబిచ్చినట్లు తెలుస్తోంది.
కపిల్ సిబాల్ మరో అడుగు ముందుకు వేసి ట్విట్టర్‌లో రాహుల్ గాంధీపై తన ఆగ్రహం ప్రకటించారు. “రాజస్థాన్ హైకోర్టులో కాంగ్రెస్ తరపున వాదించి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టింది నేను కాదా? మణిపూర్‌లో బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీకి మేలు చేసింది మేము కాదా? గత 3 దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి పార్టీ కోసం పోరాడుతుంటే మేము బిజెపితో కుమ్మక్కయ్యామని రాహుల్ గాంధీ ఏవిధంగా అనగలిగారు?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానీ మళ్ళీ కొంతసేపటికే ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆ మెసేజ్‌ను డిలీట్ చేశారు. సమావేశంలో తాను ఆవిధంగా అనలేదని రాహుల్ గాంధీ స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పడంతో ట్విట్టర్‌లో నేను పోస్ట్ చేసిన మెసేజ్‌ను ఉపసంహరించుకొన్నాను,” అని కపిల్ సిబాల్ మీడియాకు చెప్పారు.
కానీ ఈ పరిణామాలు పార్టీలో సీనియర్ నేతలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదనే విషయం బయటపడింది. అలాగే రాహుల్ గాంధీకి పార్టీలో సీనియర్ నేతలతో పొసగడం లేదనే సంగతి బయటపడింది.
ఒకవేళ రాహుల్ గాంధీ వారిని ఉద్దేశ్యించి బిజెపితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేయడం నిజమే అయితే ఇక నుంచి ఆ 23 మంది సీనియర్ నేతలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత గట్టిగా వ్యతిరేకించవచ్చు. అదే కనుక జరిగితే పార్టీలో రాహుల్ గాంధీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి లుకలుకలు మామూలే కనుక సోనియా గాంధీ సూచించినట్లు డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.