కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి పటిష్టమైన నాయకత్వం ఏర్పాటుచేయాలని కోరుతూ జాతీయస్థాయి సీనియర్ నేతలు 23 మంది పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ వ్రాయడం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. పార్టీలో ఓ వర్గం సోనియా గాంధీయే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతుండగా మరో వర్గం రాహుల్ గాంధీకే మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పగించాలని ఒత్తిడి చేస్తోంది. దీంతో పార్టీ సీనియర్ నేతలు రెండువర్గాలుగా చీలిపోయారు. కానీ సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా ముగ్గురూ కూడా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ససేమిరా అంటుండటంతో 135 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాయకత్వ సమస్య ఏర్పడింది.
ఈ సమస్యపై చర్చించేందుకు సోనియా గాంధీ అధ్యక్షతన ఇవాళ్ళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సోనియా గాంధీ తాను పదవిలో కొనసాగలేనని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రక్షాళన, పార్టీ నాయకత్వం గురించి ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఏమైనా నిర్ణయం తీసుకోగలరా లేక మళ్ళీ సోనియా, రాహుల్ గాంధీలలో ఎవరో ఒకరిని మళ్ళీ కిరీటం ధరించమని తీర్మానం చేసి చేతులు దులుపుకొంటారో చూడాలి.