కాంగ్రెస్‌ను చూసి టిఆర్ఎస్‌ భయపడుతోందా?

August 22, 2020


img

కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, రేవంత్‌ రెడ్డిలు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించడానికి వెళుతుండగా దారిలో వెల్టూరు గేట్ సమీపంలో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. సాధారణంగా ఇటువంటి విషాద ఘటనలు ఎక్కడ జరిగినా అధికార, ప్రతిపక్ష నేతలు అక్కడకు వెళ్ళి బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి అండగా నిలబడతామని భరోసా కల్పిస్తుంటారు. ఇటువంటి సందర్భాలలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు కూడా. కానీ వాటిలో నిజముంటే తప్ప సాధారణంగా ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోరు.

ఇప్పటికే వామపక్ష నేతలు అక్కడకు వెళ్ళిబాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వాన్ని విమర్శించారు కూడా. కనుక కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదు. కనుక కాంగ్రెస్ నేతలను దారిలో పోలీసులు అడ్డుకోవడం ఎందుకో అర్ధం కాదు. కానీ మిగిలిన పార్టీల నేతలను అక్కడకు అనుమతించి కాంగ్రెస్ నేతలను మాత్రమే అడ్డుకోవడం గమనిస్తే నేటికీ టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే లోపల ఎక్కడో తెలియని భయం, అభద్రతాభావం ఉన్నట్లే అనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి, ప్రజధారణ కోల్పోయిందని టిఆర్ఎస్ నేతలు పైకి ఎన్ని మాటలు చెపుతున్నప్పటికీ, నేటికీ కాంగ్రెస్ పార్టీనే తమ ప్రధాన ప్రత్యర్ధిగా భావిస్తున్నారని ఇటువంటి సంఘటనలతో అర్ధమవుతోంది. అయితే కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం ద్వారా వారి ప్రాధాన్యతను టిఆర్ఎస్ పార్టీయే స్వయంగా ప్రజలకు చాటి చెపుతోందనే సంగతి వారు గ్రహించినట్లు లేరు. 


Related Post