భారత్ క్రికెట్ చరిత్రలో తనకంటూ అధ్యాయం వ్రాసుకొన్న మహేంద్రసింగ్ ధోనీ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్‌పై దేశవిదేశాలకు చెందిన పలువురు క్రీడాకారులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. ధోనీని అభిమానించేవారిలో ప్రధాని నరేంద్రమోడీ కూడా ఒకరు. కనుక ఆయన కూడా స్పందిస్తూ ధోనీని ప్రశంశిస్తూ స్వయంగా ఓ లేఖ వ్రాశారు.
“ఎంచుకొన్న రంగంలో మీలాగా అత్యున్నత శిఖరాలను అధిరోహించినవారికి మనం కుటుంబ నేపద్యం ఏమిటి? మనం ఏ ప్రాంతానికి చెందినవారం?వంటివాటితో సంబందం లేకుండా విజయాలే చిరునామాగా ముందుకు సాగిపోతూ నేటి యువతరానికి స్పూర్తి కలిగించారు. అత్యంత క్లిష్ట పరిస్థితులలో సైతం మనోనిబ్బరం కోల్పోకుండా టీంను ధైర్యంగా ముందుకు నడిపించడం ఎలాగో మీరు ఆచరణలో చూపించారు. మీరు క్రికెట్ నుంచి తప్పుకోన్నప్పటికీ యువతకు ఎప్పటికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు,” అంటూ ప్రధాని నరేంద్రమోడీ ధోనీని తన లేఖలో ప్రశంశలతో ముంచెత్తారు.
దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఓ క్రీడాకారుడికి...అది కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినట్లు ప్రకటించిన తరువాత ఇటువంటి ప్రశంశలతో కూడిన లేఖ రావడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. అదే... ఓ పెద్ద అవార్డు వంటిదని కూడా చెప్పవచ్చు.
ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలుపుకొంటూ ధోనీ చేసిన ట్వీట్ కూడా చాలా హుందాగా ఉంది. “కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఇటువంటి అభినందనలు, గుర్తింపు కోసమే. తమ కష్టాన్ని, త్యాగాలను అందరూ గుర్తించారనే ఆలోచనే... మాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. నన్ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రధాని మోదీజీ...మీకు కృతజ్ఞతలు,” అని ధోనీ ట్వీట్ చేశారు.