కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలలో అత్యధికంగా బాధపడింది... నష్టపోయిందీ... ఏ దేశమంటే అమెరికాయే అని చెప్పక తప్పదు. కనుక కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా...ఎప్పుడు ఆ టీకా వేయించుకొని కరోనా నుంచి బయటపడదామా? అని అమెరికాతో సహా యావత్ ప్రపంచదేశాలలో ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దానిని సామాన్యప్రజలకు తప్పనిసరి చేయబోమని అమెరికా అంటువ్యాధుల నిపుణుల కమిటీ ఉన్నతాధికారి, వైట్‌హౌస్‌లో కరోనా వైరల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌచీ చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
"దేశంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు వంటి కొంతమందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి చేస్తాం. మిగిలినవారు కోరుకొంటేనే ఇస్తాం. వాక్సినేషన్ బాధ్యత, నిర్ణయాధికారాలను స్థానిక ప్రభుత్వాలకే అప్పగిస్తాం. కరోనాకు వ్యాక్సిన్ (టీకా) వేసుకోమని ఎవరినీ ప్రభుత్వం బలవంతం పెట్టదు. అది సరికాదు కూడా," అని అన్నారు.
రోజురోజుకూ కొత్త రూపంతో...కొత్త లక్షణాలను సంతరించుకొంటూ శాస్త్రవేత్తలను సైతం తికమక పెడుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి చాలా శ్రమించి వ్యాక్సిన్ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాక్సిన్ కూడా కరోనాను శాస్వితంగా అడ్డుకోగలదో లేదో శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో కరోనాను అడ్డుకొనేందుకు అదొక్కటే మార్గం. ఒకవేళ దేశంలో కొంతమందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చి కొంతమందిని విడిచిపెడితే వారిలో కరోనాను సజీవంగా బ్రతికించి ఉంచినట్లవుతుంది. వ్యాక్సిన్ తీసుకోనివారి ద్వారా అది మళ్ళీ మళ్ళీ ఇతరులకు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈవిషయం కరోనా వైరల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు ఆంథోనీ ఫౌచీకి తెలియదనుకోలేము. కానీ ఆయన వ్యాక్సిన్ తప్పనిసరి కాదని చెపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.