అవును అవినీతి జరిగింది: ప్రభుత్వ న్యాయవాది

August 20, 2020


img

హైకోర్టులో ప్రభుత్వం తరపు వాదిస్తున్న న్యాయవాది అవినీతి జరిగిందని, అవినీతి జరిగినా సదరు వ్యక్తిపై ఎటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయిందని చెప్పుకోవలసిరావడం ఎంత ఇబ్బందికరమో ఊహించుకోవచ్చు. నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఆహారం సరఫరా చేసే కోడూరి సురేష్ బాబు అనే కాంట్రాక్టర్‌ అవినీతికి పాల్పడినట్లు విచారణ కమిటీ నిర్ధారించింది. కనుక ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకొని ఉండాలి. కానీ అతనికే మరో రెండు ఆసుపత్రులకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇవ్వడం విశేషం. 

ఈ అవినీతి వ్యవహారంపై సిఐడి విచారణ జరిపించాలని కోరుతూ డాక్టర్ భగవంత్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాహితవ్యాజ్యంపై హైకోర్టు బుదవారం విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు ఇదే విషయం చెప్పగా, అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారణ అయిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా మళ్ళీ అతనికే మరో రెండు ఆసుపత్రులకు ఆహారం సరఫరా చేసే కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ద్విసభ్య  ధర్మాసనం నిలదీసింది. ఇది అవినీతిని ప్రోత్సహించినట్లు అవుతుంది కదా? అని ప్రశ్నించింది. 

అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ సమాధానమిస్తూ, సదరు కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడినట్లు రుజువైంది కనుక అతనిపై చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది,” అని తెలిపారు.  

విచారణ కమిటీ నివేదిక ఆధారంగా అతనిపై 3 వారాలలోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేస్తూ అప్పటిలోగా అతనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.


Related Post