కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పార్టీ అధ్యక్ష పదవి గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు. “కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి చెందినవ్యక్తే అధ్యక్షుడు అవ్వాలని నియమం ఏమీ లేదు. పార్టీని ఏకతాటిపై నడిపించగల సమర్ధులు బయటివారైనా నాకు అభ్యంతరం లేదు. అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ నేను వారి ఆదేశాలను శిరసావహిస్తాను. ఒకవేళ కొత్త అధ్యక్షుడు నన్ను యూపీలో వద్దు అండమాన్ నికోబార్‌కు వెళ్ళి పార్టీ బాధ్యతలను నిర్వర్తించమన్నా సంతోషంగా వెళ్ళడానికి నేను సిద్దం. మారిన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగా పనిచేస్తే కుదరదు. సరికొత్త విధానంలో ముందుకు సాగవలసి ఉంటుంది,” అని ప్రియాంకా వాద్రా అన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి క్రమంగా బలహీనపడుతూ 2019 ఎన్నికల నాటికి పూర్తిగా నిర్వీర్యమైంది. ఎన్నికలకు చాలా ముందే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖరారు అయిపోయింది. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో నేతలెవరూ పార్టీ గెలుపు కోసం గట్టిగా కృషి చేయకుండా ఎవరి స్వార్ధం వారు చూసుకొన్నారని” ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ఓటమితో అప్పటికే చాలా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజీనామాతో ఇంకా సంక్షోభంలో చిక్కుకొంది. దానికి తోడు ఆయన గాంధీ కుటుంబేతరులు మాత్రమే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని షరతు విధించడంతో పార్టీ ఇంకా ఇబ్బందులపాలైంది. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో మళ్ళీ సోనియా గాంధీయే తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టవలసివచ్చింది. ఆమె పార్టీ పగ్గాలు మళ్ళీ చేపట్టినప్పటికీ పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు పైగా ఆమె తరువాత మళ్ళీ ఎవరు బాధ్యతలు చేపడతారు?అనే అంశంపై మీడియాలో చర్చ మొదలవడంతో పార్టీలో నాయకత్వ సమస్య మరింత కొట్టవచ్చినట్లు కనబడుతోంది. ఈ తరుణంలో ప్రియాంకా వాద్రా కూడా గాంధీ కుటుంబేతరులే పార్టీ పగ్గాలు చేపట్టాలన్నట్లు మాట్లాడటంతో రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోరనే స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు. కనుక సోనియా, రాహుల్, ప్రియాంకా కాకపోతే కాంగ్రెస్ పార్టీని మరెవరూ నడిపించగలరు?అనే కొత్త చర్చకు ప్రియాంకా వాద్రా నాంది పలికినట్లయింది.