ఆ భూవివాదాలపై సిబిఐ విచారణ జరిపించాలి: మల్‌రెడ్డి రంగారెడ్డి

August 19, 2020


img

బాచారంలో 73 నుంచి 101 సర్వే నెంబర్లలో ఉన్న 412 ఎకరాల భూవివాదంపై సిబిఐ విచారణ జరిపించి, దాని వెనుక పెద్దలు ఎవరెవరున్నారో బయటపెట్టాలని కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో బారీ ఎత్తున ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దతుతో ఆక్రమణదారులు చెరువులు, కుంటలను కూడా ఆక్రమించేస్తున్నారని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్టణం పరిధిలోనే సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురయిందని దాని విలువ వేలకోట్లు ఉంటుందని అన్నారు. కనుక ఈ భూఆక్రమణలు, భూవివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సిబిఐ విచారణకు ఆదేశించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు.  

ఈ భూవివాదంతో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న వనస్థలిపురం ఏసీపీ జయరాంపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసి దర్యాప్తు జరిపిస్తోంది. వేరే వ్యవహారంలో ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌.మురళీకృష్ణ, స్టేషన్‌కు వచ్చిన ఓ వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ చేసి విచారణ జరిపిస్తోంది.  

 రెండు రోజుల క్రితమే ఖాజాగూడా చెరువు దురాక్రమాలపై విచారణ జరిపినప్పుడు హైకోర్టు జిల్లా అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతుంటే జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఏమి చేస్తున్నారని గట్టిగా నిలదీసింది. ఇప్పుడు మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఇబ్రహీంపట్టణంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.


Related Post