సిబిఐ చేతికి సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ కేసు

August 19, 2020


img

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్యపై దర్యాప్తు జరుపుతున్న మహారాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మహా పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్రానికి లేఖ వ్రాశారు. ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరడంతో దీనిపై ఇవాళ్ళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని మహా పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో అవసరమైతే సిబిఐ మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేసి కొత్త ఫైల్ (రికార్డ్) తయారుచేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు దర్యాప్తులో సిబిఐకి అన్ని విధాల సహకరించాలని మహా పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య, ఆ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై మొదటి నుంచి పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ మహా పోలీసులు వాటిని కొట్టిపడేసి సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొన్నాడని తేల్చి చెప్పారు. 

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి తన కొడుకు బ్యాంక్ ఖాతా నుంచి రూ.15 కోట్లు వేరే ఖాతాలలోకి మళ్లించిందని ఆరోపిస్తూ సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ తండ్రి పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు రాష్ట్రాల పోలీసుల మద్య వివాదం మొదలైంది. చివరికి సుప్రీంకోర్టు కలుగజేసుకొని సిబిఐకి అప్పగించడంతో ఈ కధ మరో మలుపు తిరిగింది. 

ఒకవేళ ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొన్నాడని తేలితే మహా పోలీసులకు ఊరట లభిస్తుంది కానీ ఒకవేళ అతను హత్య చేయబడ్డాడని సిబిఐ కనుగొంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారెవరో ఒత్తిడి కారణంగానే మహా పోలీసులు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించినట్లవుతుంది. దీనిపై ఇంత గొడవ జరగడానికి సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ప్రముఖ నటుడు కావడం ఒక కారణమైతే, మహారాష్ట్ర రాజకీయాలపై బిజెపి ఏదోవిధంగా మళ్ళీ పైచేయి సాధించాలని ప్రయత్నిస్తుండటంతో ఇది బిజెపి, శివసేనల మద్య రాజకీయయుద్ధంగా మారింది. కనుక మున్ముందు ఈ కేసులో ఇంకా అనేక మలుపులు ఉండవచ్చు లేదా ఏదో ఓ రోజు ఈ వ్యవహారమంతా నిశబ్ధంగా అటకెక్కిపోయినా ఆశ్చర్యం లేదు.


Related Post