పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఎస్ఐ), హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీలు తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కనుక క్లినికల్ ట్రయల్స్ పూర్తవగానే దేశంలో 135 కోట్లకు పైగా ఉన్న జనాభాకు సరిపడా వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. అలాగే వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేయవలసి ఉంటుంది. ఆ తరువాత దేశంలో ప్రజలందరికీ ఆ టీకాలు వేయవలసి ఉంటుంది. కనుక ఉత్పత్తి మొదలు టీకాలు వేసేవరకు ప్రతీదశకు చాలా భారీస్థాయిలో ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అందుకే కేంద్రప్రభుత్వం ఇప్పటి నుంచే దానికి కసరత్తు ప్రారంభించింది.
ముందుగా నిన్న ఢిల్లీలో ఆయా రంగాలకు చెందిన నిపుణులతో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలూ, సలహాలు, సూచనలు తీసుకొంది. వారి సూచనల మేరకు వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న ఎస్ఎస్ఐ, భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెన్నోవా కంపెనీలకు లేఖలు వ్రాసింది. ఈ నెల 13లోగా వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ, ధరలకు సంబంధించి పూర్తి వివరాలను అందజేయవలసిందిగా కోరింది. వాటి ఆధారంగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్‌కు చెందిన స్టాండింగ్ సబ్ కమిటీ చర్చించి, దేశంలో వ్యాక్సిన్ తయారీ బాధ్యతలను ఏ కంపెనీకి అప్పగించాలో నిర్ణయిస్తుంది.
దేశంలో 135 కోట్లకు పైగా ఉన్న జనాభాకు సరిపడా వ్యాక్సిన్‌లు ఏదో ఒక కంపెనీ మాత్రమే ఉత్పత్తి చేయాలంటే చాలా కాలం పడుతుంది కనుక ఆ 5 కంపెనీలకు బాధ్యత అప్పగించవచ్చు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నందున ఈ ఏడాది డిసెంబరులోగా కరోనాకు వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.