కొత్త రూపంతో కరోనా మహమ్మారి

August 18, 2020


img

సాధారణంగా ఏవైనా కొత్తగా వైరస్‌లు పుట్టుకొచ్చినప్పుడు కొంతకాలం తరువాత వాటి జీవప్రక్రియలో మార్పులు జరిగి బలహీనపడి నిర్వీర్యం అవడమో లేదా రూపాంతరం చెంది మరో కొత్త వైరస్‌గా ఆవిర్భవించడమో జరుగుతుంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కూడా క్రమంగా రూపాంతరం చెందుతోందని మలేసియా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల భారత్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ద్వారా కొంతమందికి కరోనా వైరస్ సోకడంతో వారిని పరీక్షించినప్పుడు కరోనా సరికొత్త అవతారంలో దర్శనమిచ్చిందని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా తెలిపారు. దీనికి ‘డీ-614’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. 

ఈ కొత్త వైరస్‌ కరోనా కంటే 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందగలదని పరిశోధనలలో గుర్తించామని చెప్పారు. కరోనా వైరస్‌ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నప్పటికీ ఈ సరికొత్త వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మరోసారి వైరస్‌ విజృంభించే అవకాశాలు కనిపిస్తోందన్నారు. అంతే కాదు...ఈ ‘డీ-614’ వైరస్‌ ప్రవేశంతో కరోనాను అడ్డుకోవడానికి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు, వ్యాక్సిన్‌ తయారీ విషయంలో కూడా అయోమయ పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు. దీంతో మళ్ళీ మొదటి నుంచి పరిశోధనలు మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.

కరోనాతో యావత్ ప్రపంచమే మారిపోయింది. అమెరికా వంటి అగ్రదేశం సైతం కరోనా మహమ్మారి ముందు తలవంచక తప్పలేదు. ఇక సామాన్య ప్రజలైతే...గత ఆరునెలలుగా అల్లాడిపోతున్నారు. ఓ పక్క కరోనా రోగం... మరోపక్క రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఒకవేళ మలేసియా అధికారి చెపుతున్నట్లు కరోనా కొత్త వేషంతో మళ్ళీ మన ముందుకు వస్తే తట్టుకోవడం కష్టమే. కానీ కరోనా వైరస్‌ వ్యాపిస్తే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చిందో అందరూ చూశారు... అనుభవించారు కనుక ఈ సరికొత్త మహమ్మారి బయటకు వ్యాపించక మునుపే అడ్డుకోగలిగితే దాంతో సమస్య ఉండకపోవచ్చు. 


Related Post