రంగారెడ్డి జిల్లాలో ఖాజాగూడ చెరువు దురాక్రమణకు గురవుతోందంటూ సోషలిస్ట్ పార్టీ (ఇండియా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ లుబ్నా సావత్ వ్రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈకేసుపై విచారణ చేపట్టినప్పుడు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల ఉదాసీన వైఖరిపై మండిపడింది. గతంలోనే ఖాజాగూడ చెరువు ఆక్రమణలకు గురవుతోందని, కొందరు అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారని, వారిని అడ్డుకొని చెరువును కాపాడాలని కలెక్టర్‌ను ఆదేశించినా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు చెరువులు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు వెలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేవిధంగా నగరంలో చెరువులన్నీ ఆక్రమణలకు గురయితే భవిష్యత్‌లో హైదరాబాద్ నగరం రాజస్థాన్ ఏడారిలా మారిపోయే ప్రమాదం ఉంటుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్రేటర్ పరిధిలో చెరువుల పరిరక్షణకు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని తాము గతంలోనే ఆదేశించామని, తమ ఆదేశాన్ని కూడా పట్టించుకోలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాజాగూడ చెరువు దురాక్రమణలపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందో వివరణ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ ప్రసాద్‌ను కోరగా ఆయన కొంత గడువు కోరారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటిలోగా పూర్తి వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు పోలీసులను వెంటబెట్టుకొని వెళ్ళి ప్రభుత్వ భూములలో పేదలు నిర్మించుకొన్న రేకుల షెడ్లను జేసీబీతో కూల్చివేసినట్లు తరచూ వార్తలలో అందరూ చూస్తూనే ఉంటారు. ప్రభుత్వ భూములలో నిరుపేదలు రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తుంటే నిర్ధాక్షిణ్యంగా వారి ఇళ్లను కూల్చివేయగలిగినపుడు, ప్రభుత్వానికి చెందిన చెరువు భూములను బడా బాబులు ఆక్రమించుకొని దానిలో అపార్టుమెంట్స్ కడుతుంటే అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు?అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడాన్ని ఏమనుకోవాలి?