తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిలపై సునిశిత విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సచివాలయం ఆవరణలో ఉన్న రెండు మసీదులను, ఒక ఆలయాన్ని ప్రభుత్వం కూల్చివేయిస్తే, అసదుద్దీన్ ఓవైసీ, కిషన్‌రెడ్డి ఇద్దరూ సిఎం కేసీఆర్‌ను ప్రశ్నించకుండా మౌనం వహించడానికి అర్ధం ఏమిటి? ఎక్కడో యూపీలో దశాబ్ధాల క్రిందట బాబ్రీ మసీదు కూల్చివేస్తే నేటికీ కేంద్రంపై విరుచుకుపడుతున్న అసదుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్‌లోనే కేసీఆర్ ప్రభుత్వం రెండు మసీదులు కూల్చివేస్తే ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన తన పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజకీయాలు చేస్తుంటారని దీనిని బట్టి అర్ధమవుతోంది.
ఈ విషయంలో బిజెపి ద్వందవైఖరి కూడా బయటపడింది. టిఆర్ఎస్, బిజెపిల మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే రాష్ట్ర బిజెపి నేతలు ఎవరూ సచివాలయంలో ఆలయం కూల్చివేతపై నోరుమెదపడం లేదని అర్ధమవుతోంది.
సచివాలయంతో పాటు అక్కడే ఉన్న రెండు మసీదులు, ఆలయాన్ని కూల్చివేసి, సచివాలయం కూల్చివేస్తుంటే శిధిలాలు పడి దెబ్బతిన్నాయని సిఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు. వాటికి నష్టం కలగకుండా సచివాలయం కూల్చివేతపనులు చేసుకొనే వీలున్నప్పుడు వాటిని ఎందుకు కూల్చివేశారు? సిఎం కేసీఆర్ నా ఈ ప్రశ్నలకు సూటిగా సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలరా?ఈ విషయంలో టిఆర్ఎస్, మజ్లీస్, బిజెపి మూడు పార్టీలు మౌనం వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఊరుకోదు. త్వరలోనే నేను సచివాలయంలో మసీదులు, ఆలాయం కూల్చివేతలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయపోరాటం చేస్తాను,” అని అన్నారు.