తెలంగాణలో ప్రకృతి విపత్తులకు శాస్విత విధానం

August 18, 2020


img

తెలంగాణలో...ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో పలుజిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. వేలాది ఎకరాలలో పంటలు నీట మునిగాయి. అనేక చోట్ల వందలాది పాత ఇళ్ళు కూలిపోయాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమయ్యి అన్ని ఏర్పాట్లు చేసి వేలాదిమందిని ఇళ్ళు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. అయినప్పటికీ గత మూడు రోజులలో ప్రమాదవశాత్తు కొంతమంది చనిపోయారు. 

రాష్ట్రంలో వానలు, వరదల ఉదృతిపై సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యి చర్చించారు. ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకొని అందరూ పనిచేయాలని సూచించారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే విషయంలో కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపారని సిఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా కేవలం ఆంద్రా ప్రాంతాలలోనే ఏర్పాట్లు చేసుకొన్నారని సిఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

కనుక ఇకపై తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవిస్తే వాటిని ఎదుర్కొనేందుకు శాస్విత ప్రాతిపదికన ఏర్పాట్లు అవసరమని వాటి కోసం ‘ఫ్లడ్ మేనేజిమెంట్ ఆఫ్ తెలంగాణ’ పేరిట నూతన విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దాని కోసం సిఎం కేసీఆర్‌ అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఇకపై శాస్విత ప్రాతిపదికన వర్షపాతం నమోదు చేయడం, ఎంత వర్షం పడితే ఏఏ ప్రాంతాలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది…ఏ మేరకు పంటలు నీట మునిగే అవకాశం ఉంటుంది...ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు, వారిని ఉంచేందుకు శాస్విత శిబిరాల నిర్మాణం, వాటి నిర్వహణ, వరద బాధితులకు ఆహారం, మందులు వగైరా సరఫరా, రైతులకు నష్టపరిహారం చెల్లింపు వంటి ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నూతన విధానాన్ని రూపొందించాలని సిఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 



Related Post