రాష్ట్ర విభజన సమయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, అదే సమయంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో చాలా తెలివిగా, చురుకుగా వ్యవహరిస్తూ బిజెపి, జనసేనలతో పొత్తులు పెట్టుకొని అధికారం చేజిక్కించుకొన్నారు. కానీ పార్టీలో కొందరి తప్పుడు సలహాలను నమ్మి ప్రధాని నరేంద్రమోడీపై యుద్ధం ప్రకటించి బిజెపితో తెగతెంపులు చేసుకొన్నారు. ఆ తరువాత ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా విమర్శిస్తూ, వ్యక్తిగతంగా దూషిస్తూ రెండేళ్ళు కాలక్షేపం చేసేశారు.
తన చాప కిందకు నీళ్ళు వస్తున్న సంగతిని చూసుకోకుండా కేంద్రంలో మళ్ళీ బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకు జాతీయస్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. విభజనతో దెబ్బ తిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు పునర్నిర్మిస్తారని నమ్మకంతో ప్రజలు ఆయనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తే దానిని ఆయన వినియోగించుకోలేకపోయారు. కనీసం గుర్తించారో లేదో కూడా తెలీదు. చివరికి ఆయన పరిస్థితి ఇప్పుడు ఏవిధంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన టిడిపి ఇప్పుడు మనుగడ కోసం పోరాడవలసివస్తోంది. ఈ పరిస్థితులలో చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీతో సంబంధాలు పునరుద్దరించుకోవాలనుకోవడం సహజమే. బహుశః ఆ ప్రయత్నాలలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు టిడిపి మద్దతు ఇచ్చింది. కానీ బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ కానీ చంద్రబాబునాయుడును పట్టించుకోలేదు.
తాజాగా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ వ్రాయడం విశేషం. ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, జర్నలిస్టులు, చివరికి న్యాయవాదుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందని ఆ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని దాంతో ప్రజాస్వామ్యం, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీని అభ్యర్ధించారు.
ఒకప్పుడు ప్రధాని నరేంద్రమోడీని నోటికి వచ్చినట్లు విమర్శించి, ఆయన రాష్ట్ర పర్యటనకు వస్తే కనీసం మర్యాద కోసమైన వెళ్ళి పలకరించకుండా ఘోరంగా అవమానించిన చంద్రబాబునాయుడు, ఇప్పుడు అదే ప్రధాని నరేంద్రమోడీకి తన కష్టాలను మొరపెట్టుకొంటూ లేఖ వ్రాయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబునాయుడు లేఖపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.