టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హటాన్మరణంతో ఖాళీ అయిన దుబ్బాక శాసనసభ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యమైనందున అధికార టిఆర్ఎస్, ప్రతిపక్షపార్టీలు పోటీకి సన్నాహాలు మొదలుపెట్టేయి. రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకే ఆ సీటును కేటాయించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇవాళ్ళ గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతోంది కనుక పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీ అభ్యర్ధి, ఎన్నికల వ్యూహాలపై పార్టీలో అంతర్గతంగా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకొంటాము. కనుక అంతవరకు పార్టీలో ఎవరూ దీని గురించి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించబడుతుంది తప్ప పార్టీది కాదని మనవి చేస్తున్నాను. ఈ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించి కాంగ్రెస్ సత్తాను చాటి చెపుదాము,” అని అన్నారు. తెలంగాణ జనసమితి, వామపక్షాలు, టిడిపి ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే అవకాశం ఉంది. ఇక బిజెపి ఎప్పటిలాగే ఒంటరిగా పోరాడకతప్పదు.
రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్స, లెక్కలపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపధ్యంలో ఈ ఉపఎన్నికలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ టిఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే సానుభూతి సెంటిమెంటు పని చేసిందనుకోవచ్చు. కానీ కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు ప్రజామోదం లభించిందని కూడా చెప్పుకొనే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ లేదా బిజెపి అభ్యర్ధి గెలిచినట్లయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నందున దుబ్బాక ఉపఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కష్టమే కనుక మరో రెండు మూడు నెలల తరువాతే జరుగవచ్చు.