ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి ఆరాటపడుతుంటే, ఒక్క అడుగు కూడా ముందుకువేయకుండా హైకోర్టు బ్రేకులు వేస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదముద్రవేయడం, రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని తెలియజేస్తూ కేంద్రప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలుచేయడంతో అమరావతి నుంచి విశాఖకు సచివాలయంతో పాటు సిఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. కానీ విభజన చట్టంలో ఏపీకి ఒక రాజధానిని మాత్రమే ఏర్పాటుచేయాలని ఉందని కానీ ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటుచేసేందుకు సిద్దమవుతోందని, ఇది చట్టవిరుద్దమని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో విచారణ జరిపి తుదితీర్పు వెలువరించేవరకు అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు యధాతధస్థితి (స్టేటస్ కో)ను కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈరోజు మళ్ళీ జరిగిన విచారణలో ప్రభుత్వం తరపు వాదించిన న్యాయవాది ‘స్టేటస్ కో’ కొనసాగించడం వలన ప్రభుత్వ కార్యాలయాలను, సిఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించలేకపోతున్నామని, దాని వలన పరిపాలనకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, కనుక స్టేటస్ కో ఉత్తర్వులను ఎత్తివేయాలని హైకోర్టును అభ్యర్ధించారు. కానీ ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 27వరకు ‘స్టేటస్ కో’ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పుడెప్పుడు అమరావతి నుంచి విశాఖకు ఎగురుకొంటూ వెళ్లిపోదామా అని చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.