అన్నంత పనీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

August 14, 2020


img

హైదరాబాద్‌లో కరోనా రోగులకు వైద్యచికిత్సలు అందింస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు తీరు మార్చుకోకపోతే కటిన చర్యలు తీసుకొంటామని పదేపదే హెచ్చరిస్తున్న ప్రభుత్వం వాటి తీరు మారకపోవడంతో చివరికి అన్నంత పనీ చేసింది. ప్రైవేట్ ఆసుపత్రులలో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంది. నిన్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమైన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వారితో చర్చించి ఈ నిర్ణయం తీసుకొన్నారు. అందుకు వారు అంగీకరించక తప్పలేదు. 

దీంతో ప్రభుత్వం చేతికి అదనంగా మరో 3,940 పడకలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 1,608 సాధారణ పడకలు, ఆక్సిజన్ సౌకర్యం కలిగినవి 1,572 పడకలు, ఐసీయులో 759 పడకలున్నాయి. వీటన్నిటినీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భర్తీ చేస్తుంది. శుక్రవారం మళ్ళీ మరోసారి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి దీనికి అవసరమైన విధివిధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేస్తామని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన నిన్న జరిగిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్యా కన్వీనర్ (డీఎంఈ) డాక్టర్‌ రమేష్‌రెడ్డి, నిమ్స్‌ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ గంగాధర్‌, కాళోజీ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


Related Post