మూడడుగులు కాదు...15 అడుగులు వ్యాపిస్తుందిట!

August 13, 2020


img

కరోనా వైరస్ ఎవరికీ అంతుచిక్కని బ్రహ్మపదార్ధంలా తయారవుతోంది. దాని గురించి రోజూ ఏదో కొత్త విషయం బయటపడుతూనే ఉంది. తాజాగా కరోనా వైరస్ గాలిలో సుమారు 15 అడుగుల దూరం వరకు వ్యాపిస్తుందని ఫ్లోరిడా యూనివర్సిటీలో వైరాలజీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు వారు శాస్త్రీయ ఆధారాలతో కూడిన రూపొందించిన పరిశోధనా పత్రాన్ని మెడ్‌రెక్సివ్‌లో ప్రచురించారు కూడా. తమ పరిశోధనల ప్రకారం కరోనా వైరస్ సుమారు 15 అడుగుల దూరం వరకు వ్యాపిస్తుంది కనుక కరోనా మార్గదర్శకాలను కూడా మార్చాలని వారు సూచించారు. ప్రస్తుతం పాటిస్తున్న మూడడుగుల భౌతిక దూరాన్ని 15 అడుగులకు పెంచాలని వారు సూచించారు. లేకుంటే కరోనా రోగుల నుంచి 15 అడుగుల పరిధిలో ఉన్నవారందరికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంటుందని, అప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టం అవుతుందని వారు చెపుతున్నారు. వారి పరిశోధనను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదించినట్లు తాజా సమాచారం. 

కానీ 15 అడుగుల భౌతికదూరం పాటించడం అనివార్యమైతే మళ్ళీ అన్ని దేశాలు లాక్‌డౌన్‌ విధించుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, సినిమా హాల్స్, విమానాలు, రైళ్లు, బస్సులు వగైరాలలో మూడడుగుల భౌతికదూరం పాటించడమే చాలా కష్టంగా ఉంది. ఇక 15 అడుగులు దూరం పాటించాలంటే అన్నీ మూసుకోకతప్పదు. అంటే లాక్‌డౌన్‌ విధించుకోవడమే అనుకోవచ్చు. 

అయితే కరోనా మహమ్మారికి భయపడి దేశ ఆర్ధిక వ్యవస్థలను, పేద ప్రజల జీవనాధారాలను పణంగా పెట్టేందుకే ఇప్పుడు ఏ దేశమూ సిద్దంగా లేదు కనుక అంత దూరం పాటించేందుకు ఏ దేశమూ అంగీకరించకపోవచ్చు. పైగా ఇప్పుడు కరోనా రికవరీ రేటు బాగా పెరిగింది. కరోనా చికిత్సకు మంచి మందులు వచ్చాయి. త్వరలో వ్యాక్సిన్‌ కూడా రాబోతోంది. కనుక మూడడుగుల భౌతిక దూరంతోనే కరోనా కధ సుఖాంతం కావచ్చు.


Related Post