సిఎం కేసీఆర్‌ మనుమడు అరెస్ట్?

August 13, 2020


img

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనుమడిని పోలీసులు అరెస్ట్ చేయడమేమిటి? అని ఆశ్చర్యం కలుగవచ్చు కానీ ఇది నిజం. అయితే అతను కేటీఆర్‌ కుమారుడు హిమాంషు కాదు. కేసీఆర్‌ అన్న కూతురు రమ్యారావు కుమారుడు రితేష్. అంటే మనుమడి వరుసే. ఇంతకీ అతనిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారంటే అతను నిన్న ఎన్.ఎస్.యూ.ఐ కార్య‌క‌ర్త‌లతో కలిసి ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నాడు. అదేమిటి... అతను తాతపై తిరుగుబాటు చేయడమేమిటి? అనుకోవద్దు. 

అతని తల్లి రమ్యారావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కనుక పార్టీ పరంగా ఆమె సిఎం కేసీఆర్‌తో విభేదిస్తుంటారు. కనుక కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆమె అప్పుడప్పుడు విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ కారణంగా ఆ రెండు కుటుంబాల మద్య రాజకీయ శతృత్వం అడ్డుగోడగా నిలిచింది. కనుక పోలీసులు అతనిని ఓ కాంగ్రెస్‌ నేత కుమారుడిగానే భావించి అరెస్ట్ చేసి ఉండవచ్చు. మిగిలినవారితో పాటు అతనిపై కూడా కేసు నమోదు చేయడమే కాక ఈ కేసులో రితేష్ ను ఏ-5 ముద్దాయిగా చేర్చి కోర్టులో హాజరుపరచగా వారికి కోర్టు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విదించింది. దాంతో పోలీసులు రితేష్ తో సహా మిగిలిన కార్యకర్తలందరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. 

ప్రగతి భవన్‌ ముట్టడితో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబందమూ లేదు కానీ కాంగ్రెస్‌ నేత అయిన రితేష్ తల్లి రమ్యారావు ఘాటుగా స్పందించారు. “పోలీసులు అరెస్ట్ చేసినవారందరూ విద్యార్దులు. ఈ కరోనా సమయంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ సిఎం కేసీఆర్‌ అధికార నివాసం ముందు ధర్నా చేశారే తప్ప వేరే దేనికో కాదు. తమ సమస్యను సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లాలని వారు నిరసనలు తెలియజేస్తే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.


Related Post