ప్రైవేట్ ఆసుపత్రులకు మంత్రి ఈటల మరోసారి హెచ్చరిక

August 11, 2020


img

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు అనుమతి పొందిన ప్రైవేట్ ఆసుపత్రులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నిన్న మరోసారి గట్టిగా హెచ్చరించారు. కరోనా చికిత్సకు ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే పదిరెట్లు ఎక్కువగా వసూలుచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటివరకు 1039 పిర్యాదులు అందాయని ఇకనైనా తీరు మార్చుకోకపోతే వాటిలో 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసి వస్తుందని మంత్రి ఈటల రాజేందర్‌ గట్టిగా హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకొంటున్న చర్యలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకాలపై చర్చించారు. ఆ సందర్భంగా వారు ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినప్పుడు అదుపు తప్పుతున్న ఆసుపత్రులపై చట్టప్రకారం కటిన చర్యలు తీసుకోకతప్పదని అన్నారు. 

ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను నిలువునా దోచుకొంటున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి, హైకోర్టు దృష్టికి వెళ్ళిందని తెలిసినా, ప్రభుత్వం, హైకోర్టు పదేపదే తీవ్రంగా హెచ్చరిస్తున్నా ప్రైవేట్ ఆసుపత్రుల తీరు మారకపోవడం గమనిస్తే తాము ఎవరినైనా ‘మేనేజ్ చేయగలమని’ కనుక ఏమి చేసినా చెల్లుతుందనే అహంభావంతో వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షల రూపాయలు ముక్కు పిండివసూలు చేస్తుంటే, ప్రభుత్వం వాటి నుంచి ఆ సొమ్మును రాబట్టి కటిన చర్యలు చేపట్టే బదులు వాటికి కరోనా చికిత్స చేయడానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసి ఊరుకోవడమే వాటికి అలుసుగా మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం తమను ఏమీ చేయదు... చేయలేదనే ధైర్యం, నమ్మకంతోనే కరోనా రోగులను దోచుకొంటున్నట్లు భావించవచ్చు. కనుక ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం చట్టపరంగా కటిన చర్యలు తీసుకొన్నప్పుడే వాటిని నియంత్రించడం సాధ్యం అవుతుంది. ఈవిధంగా వాటిపై వస్తున్న పిర్యాదులను లెక్కించుకోవడం వలన ఏ ప్రయోజనం ఉండదు...వాటి తీరూ మారదు.


Related Post