తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు నిన్న హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. అందువల్ల సెప్టెంబర్ నెలాఖరుకి రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. “ఇదివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతీరోజు భారీగా కేసులు నమోదవుతుండేవి కానీ అవి ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నెలాఖరుకు పూర్తిగా తగ్గుతాయని ఆశిస్తున్నాము. కానీ రంగారెడ్డి, మల్కాజిగిరి మేడ్చల్ జిల్లాలలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటాన్ని మేము గుర్తించాము. వాటినీ కట్టడి చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాము. ప్రభుత్వం చేపట్టిన పలుచర్యలతో కరోనా రికవరీని బాగా పెంచగలిగాము. ఇక నుంచి కరోనా మరణాలను తగ్గించేందుకు గట్టిగా ప్రయత్నిస్తాము. కరోనాకు మందుల కంటే ధైర్యమే మంచి మందు. కనుక కరోనా వచ్చిందని క్రుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కరోనా బారిన పడినవారిలో చాలా మంది మొదటివారంలోనే కొలుకొంటున్నారు. కొంతమందికి మాత్రం రెండు వారాల సమయం పడుతోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే చాలా ఆశాజనకంగానే ఉన్నాయి. కనుక సెప్టెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోవచ్చునాని భావిస్తున్నాను,” అని అన్నారు.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రవేశించిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వం చాలా గట్టిగా కృషి చేయడంతో కరోనా కేసులను కట్టడి చేయగలిగింది. ఆ నమ్మకంతోనే ఏప్రిల్ 7వ తేదీకి రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని సిఎం కేసీఆర్ తేదీని కూడా ప్రకటించేశారు. కానీ 4 నెలల తరువాత నేటికీ రాష్ట్రం కరోనా నుంచి విముక్తి పొందలేదు పైగా రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలా పెరిగిపెరిగి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 77,513కి చేరాయి. ఇదివరకు సామాన్య ప్రజలే ఎక్కువగా కరోనాబారిన పడుతుండేవారు. కానీ ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే రాబోయే రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. కానీ సెప్టెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతాయని రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పడం విశేషం. అంటే కరోనాకు మరో డెడ్‌లైన్ అనుకోవాలేమో? ఆయన చెపుతున్నట్లు సెప్టెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రంలో కరోనా నుంచి విముక్తి పొందగలిగితే అంతకంటే ఏం కావాలి? అందరికీ సంతోషమే కదా!